
ప్రతీకాత్మక చిత్రం
టీచర్ మందలించడంతో బాలిక ఆత్మహత్య
ముంబై : మహారాష్ట్రలోని పందార్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి రాసిన లవ్‌లెటర్‌తో మనస్థాపం చెందిన 15 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలికకు దుండగుడు రాసిన లేఖ క్లాస్ టీచర్ చేతికందడంతో ఆమె అందరి ఎదుట బాలికను మందలించింది. బాలిక తల్లితండ్రులను పిలిచి లేఖ విషయం వారికి చేరవేసింది. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందిన బాధిత విద్యార్ధిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బాలిక తండ్రి ఈ ఘటనపై స్పందిస్తూ తమకు స్కూల్ నుంచి ఫోన్ కాల్ రావడంతో తాను అక్కడికి వెళ్లగా తన కుమార్తె ఏడుస్తూ కనిపించిందన్నారు. తమ కుమార్తె చేతిలో ప్రేమలేఖ ఉందని టీచర్ చెప్పగా, తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, ఈ లేఖ ఎవరు రాశారో కూడా తనకు తెలియదని తమ బాలిక చెప్పిందన్నారు.
అనంతరం ఇంటికి వచ్చిన కొద్ది సేపటికే ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందిన తమ కుమార్తె సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. బాలిక మరణించిన కొద్దిసేపటికే వాఖ్రి గ్రామస్ధులు పందార్పూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మరణానికి కారణమైన గుర్తుతెలియని ప్రేమికుడు ఎవరనేది నిగ్గుతేల్చనున్నారు.