చికిత్స పొందుతూ చిన్నారి మృతి

Girl Child Died in Hospital Vizianagaram - Sakshi

పుట్టిన రోజు నాడే మృత్యు  ఒడిలోకి

నెల్లిమర్ల: స్థానిక మిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. చిన్నారి బంధువులు అందించిన వివరాల ప్రకారం మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన వల్లూరు నరేష్, మాధురి దంపతుల కుమార్తె వల్లూరి దీప్తి(4) జ్వరం రావడంతో వారం రోజుల క్రితం మిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. ఊపిరితిత్తుల్లో కఫం చేరిందని నిర్ధారించిన వైద్యులు వార్డులో చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. గురువారం నాటికి దాదాపు ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జి చేయాలని నిర్ణయించారు. అయితే ఇంటికి పంపించే ముందు ఓ ఇంజిక్షన్‌ ఇచ్చారు. ఇంజిక్షన్‌ రియాక్షన్‌ ఇవ్వడంతో చిన్నారి కొద్ది సమయంలోనే మృత్యువాత పడింది. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లనే తమ చిన్నారి చనిపోయిందని తల్లిదండ్రులతో పాటు బంధువులు ఆరోపించారు. వైద్యం అందించడంలో తమ నిర్లక్ష్యం లేదని, యాంటీబయోటిక్‌ ఇంజిక్షన్‌ మాత్రమే తాము చేశామని వైద్యులు తెలిపారు.

పుట్టినరోజునే మృత్యు ఒడికి..
గురువారం చిన్నారి దీప్తి పుట్టినరోజు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దీప్తి మిమ్స్‌ ప్రాంగణంలో ఉన్న రామాలయానికి వెళ్లింది. ఆలయ అర్చకులు సంపత్‌ దీర్ఘాయుష్మాన్‌ భవ అని దీవించారు. తన పుట్టినరోజు అని వార్డులోని చిన్నారులందరికీ చాక్లెట్లు పంచిపెట్టింది. తాను ఇంటికి వెళ్లిపోతున్నానని, ఇంటిదగ్గర కేకు కట్‌ చేస్తానని సంతోషంగా చెప్పింది. అయితే ఇంతలోనే కన్నుకుట్టిన మృత్యువు ఆ చిన్నారిని తీసుకెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతులేకుండా పోయింది. వార్డులోని ఇతర చిన్నారులు, తల్లిదండ్రులు దుంఖంలో మునిగిపోయారు. దీర్ఘాయుష్మాన్‌ భవ అని దీవించిన అర్చకుడి దీవెనలు కూడా చిన్నారిని మృత్యువు నుంచి కాపాడలేకపోయాయని అందరూ భోరుమన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top