ఆర్మీ సిపాయిపై చిన్నారి ఫిర్యాదు

Girl Child Complaint on Army Soldiers in Tamil Nadu - Sakshi

తమిళనాడు, వేలూరు: తిరువణ్ణామలై జిల్లా పోలూరు తాలుకా మంగళాపురం గ్రామానికి చెందిన ఏయుమలై కుమార్తె రేణుగ(27). ఈమెకు క్రిష్ణాపురానికి చెందిన నాగేంద్రన్‌(30)కు 2012లో వివాహమైంది. దంపతులకు యోగిశ్రీ (8), ధనశ్రీ(2) ఇద్దరు కుమార్తెలున్నారు. నాగేంద్రన్‌ గుజరాత్‌లో ఆర్మీ సిపాయిగా పనిచేస్తున్నాడు. వీరందరూ కలిసి గుజరాత్‌లోనే నివసిస్తున్నారు.  గత నెల 27న రేణుగ ఆత్మహత్య చేసుకున్నట్లు ఏయుమలైకి సమాచారం వచ్చింది. ఆయన ఆక్కడకు వెళ్లి రేణుగ మృత దేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు క్రిష్ణాపురానికి తీసుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఆయన మనుమరాలు యోగీశ్రీ అమ్మపై నాన్న కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టాడని తెలిపింది. ఆశ్చర్యపోయిన ఏయుమలై బంధువులతో కలిసి తిరువణ్ణామలై కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టర్‌ కందస్వామికి వినతి పత్రం అందజేశాడు.

ఆ వినతిలో.. తనకు నలుగురు కుమార్తెలున్నారని, అందులో మూడో కుమార్తె రేణుగను 2012 జూన్‌ 6వ తేదీన క్రిష్ణాపురానికి చెందిన శేఖర్‌ కుమారుడు నాగేంద్రన్‌కు వివాహం చేసినట్టు తెలిపారు. నాగేంద్రన్‌ గుజరాత్‌లో ఆర్మీ సిపాయిగా పనిచేస్తున్నందున తన కుమార్తె కూడా వారితో పాటు ఉండేదన్నారు. నాగేంద్రన్‌ తన కుమార్తెను తరచూ వరకట్నం కోసం వేధింపులకు గురిచేసే వాడని, గత 27వ తేదీన తన సెల్‌పోన్‌కు కాల్‌ వచ్చిందన్నారు. అందులో తన కుమార్తె సిలిండర్‌ పేలి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి గుజరాత్‌కు వెళ్లామని, అప్పటికే తన కుమార్తె మృతి చెందినట్లు తెలిపారన్నారు. తర్వాత మృత దేహాన్ని గ్రామానికి తీసుకొచ్చామని చెప్పారు. ఇంటికి వచ్చిన అనంతరం తన మనుమరాలు అసలు విషయం తెలిపిందన్నారు. భర్త నాగేంద్రన్‌ కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టి ఆత్మహత్యగా చిత్రికరించినట్లు తెలిపినట్టు వెల్లడించారు. వినతిని స్వీకరించిన కలెక్టర్‌ ఎస్పీకి సిపారస్సు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top