బాలిక కిడ్నాప్‌ కేసులో ముద్దాయిలకు యావజ్జీవం

five sentenced to life imprisonment for kidnapping girl - Sakshi

రూ.పదివేలు చొప్పున జరిమానా

16 ఏళ్లకు వెలువడిన తీర్పు

జయపురం: ఒక బాలికను కిడ్నాప్‌ చేసిన కేసులో 16 ఏళ్ల తరువాత కొరాపుట్‌ జయపురం జిల్లా జడ్జి ఐదుగురు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పునిచ్చారు. శిక్ష పడిన ముద్దాయిలు జయపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సి. భుజంగఆచారి, కె. స్వామికృష్ణ, టి. రాకేష్‌ కుమార్‌,సి. కిరణ్‌ కుమార్‌, సుమేష్‌ శెట్టిలు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. కొరాపుట్‌ టెలికాం డివిజన్‌ మేనేజర్‌ కె. రాజశేఖర్‌ 4 యేళ్ల కుమార్తె 2002 డిసెంబర్‌ 18వ తేదిన ఉదయం 11.15గంటల సమయంలో పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కిడ్నాప్‌ చేసి తండ్రి రాజశేఖర్‌కు ఫోన్‌ చేసి రూ. 10 లక్షలు డిమాండ్‌ చేశారు.

కిడ్నాపర్లు సూచించిన ప్రకారం రాజశేఖర్‌ డబ్బుతో ఘాట్‌గుమార్‌ సమీపంలోగల కారభైరవ మందిరం వద్దకు వెళ్లారు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో రాజశేఖర్‌ తిరిగి వెళ్లిపోయారు. ఈ మేరకు రాజశేఖర్‌ కొరాపుట్‌ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆ మరునాడు 19వ తేదీన కొరాపుట్‌ కాఫీబోర్డు ప్రాంతంలో ఒక విద్యార్థినిని చూసి ఆమెను రాజశేఖర్‌ ఇంటికి తీసుకువచ్చి అప్పగించారు. తరువాత పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. 

ఇద్దరు నిందితులు నిర్దోషులుగా విడుదల
కేసును సుదీర్ఘంగా విచారించిన జిల్లా జడ్జి విద్యుత్‌ కుమార్‌ మిశ్రా 24 మంది సాక్షులను విచారించి ఐదుగురు నిందితులను దోషులుగా నిర్ధారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ. 10వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించలేకపోతే మరో రెండేళ్ల జైలు జీవితం గడపాలని తీర్పులో స్పష్టం చేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు ఎస్‌. కామేశ్వర రావు, కైలాశ ఖొరలను నిర్దోషులుగా విడిచిపెట్టారు. మరో నిందితుడు ఉమానాయక్‌ మరణించాడు. ఈ కేసును ప్రభుత్వ న్యాయవాది కైలాస్‌పట్నాయక్‌ వాదించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top