మార్కెట్‌లో రైతును బలిగొన్న డీసీఎం

Farmer dead in an accedent in Agricultural market  - Sakshi

రైతు కాళ్లపై నుంచి వెళ్లిన వాహనం

ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి

పత్తిని ఆరబెట్టి నిద్రిస్తుండగా ఘటన

కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకుల నిరసన

రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఎమ్మెల్యే దయాకర్‌రావు

వరంగల్‌ సిటీ: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు పత్తిని తీసుకొచ్చిన రైతును డీసీఎం వ్యాను బలిగొంది.  యార్డు ఆవరణలో ఆరబెట్టుకుని నిద్రిస్తుండగా బుధవారంరాత్రి మిర్చి లోడుతో ఉన్న డీసీఎం వాహనం అతడి కాళ్లపై నుంచి వెళ్లింది. జనగామ జిల్లా దేవురుప్పుల మండలం దేవునిగుట్ట తండాకు చెందిన బానోతు రవి(40), తండ్రి మంజ్య, ఇద్దరు సోదరులతో కలసి 150 బస్తాల పత్తిని బుధవారం ఉదయం పవన్‌ ట్రేడర్స్‌ అడ్తికి అమ్మకానికి తీసుకొచ్చారు. పత్తిలో తేమ శాతం అధికంగా ఉంది. 

దీంతో పత్తిని ఆరబెట్టిన రవి, తండ్రి, సోదరులతో కలసి అక్కడే నిద్రపోయాడు. ఈ క్రమంలో ఏటూరునాగారం నుంచి మార్కెట్‌కు మిర్చిలోడుతో వచ్చిన డీసీఎం రవి కాళ్లపై నుంచి వాహనం వెళ్లింది. దీంతో రవి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు, అధికారులు, సెక్యూరిటీ గార్డులు బాధితుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో గురువారం ఉద యం రవి మృతి చెందాడు.

రైతు మృతి చెందిన విషయం తెలుసుకున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు మార్కెట్‌కు వచ్చి నిరసన తెలిపారు. రైతు మృతికి కారకులైన మార్కెట్‌ పాలక వర్గం, మంత్రి హరీశ్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే దయాకర్‌రావు ఎంజీఎంకు వచ్చి ప్రభుత్వం తరఫున రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా, సొం తంగా రూ.30 వేలు అందజేశారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top