ఎంత పనిచేశావు తండ్రీ!

Family Conflicts Son Assassinated Father And Children Tamil nadu - Sakshi

ముగ్గురు పిల్లలను హత్యచేసి తండ్రి ఆత్మహత్య

వడమంగళంలో కలకలం

భార్యాభర్తల మధ్య గొడవలే కారణమా?

తిరువొత్తియూరు: శ్రీపెరంబదూరు సమీపంలో ముగ్గురు పిల్లలను హత్య చేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపం వడమంగళంకు చెందిన ఆర్ముగం (37) కూలీ కార్మికుడు. అతని భార్య గోవిందమ్మాళ్‌ (32). వీరికి రాజేశ్వరి (12), షాలిని (10), సేతురామన్‌ (08) పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం భార్యాభర్తల మధ్య గొడవ ఏర్పడింది. గోవిందమ్మాళ్‌ శ్రీపెరంబదూరు సమీపంలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పారిశుద్ధ్య పనులకు వెళ్లింది. పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పెద్ద కుమార్తె రాజేశ్వరి స్పృహతప్పి పడి ఉంది. కుమార్తెను లేపేందుకు ప్రయత్నించగా అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు తెలుసుకుంది. భర్త, ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవడంతో దిగ్భ్రాంతి చెందింది.

ఇంటి సమీపంలో గాలించింది. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చింది. వడమంగళం ప్రాంతంలోని వ్యవసాయబావి సమీపంలో ఉన్న ఒక చెట్టుకు ఆర్ముగం ఉరి వేసుకుని తనవు చాలించాడు. శ్రీపెరంబదూరు పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా పిల్లలు కనిపించలేదు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బావిలో గాలించగా షాలినీ, సేతురామన్‌ మృతదేహాలు బయటపడ్డాయి.ఇద్దరూ ఒకే దారంతో కాళ్లు కట్టివేసి ఉండడం చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం శ్రీపెరంబదూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణలో భార్యతో గొడవపడిన ఆర్ముగం జీవితంపై విరక్తి చెంది పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని తెలిపారు. (విడాకుల కేసులో ఉత్తమ నటుడు)

తండ్రి, కుమారుడు హత్య
తూత్తుకుడి జిల్లా ఒట్టపిడారం సమీపం తెర్కు బొమ్మయాపురానికి చెందిన కరుప్పుస్వామి కుమారుడు కాళిస్వామి (40). ఇతను కూలీ కార్మికుడు. అదే ప్రాంతానికి చెందిన కాళిపాండియన్‌ కుమారుడు బాలమురుగన్‌ (22). అతను, కాళిస్వామి ఆదివారం రాత్రి అదే ప్రాంతంలోని విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద మద్యం మత్తులో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆగ్రహం చెందిన బాలమురుగన్‌ సమీపంలో ఉన్న ఇంటికి వెళ్లి కత్తిని తీసుకొచ్చి కాళిస్వామిపై దాడి చేసినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న కరుప్పుస్వామి దిగ్భ్రాంతి చెంది అక్కడికి చేరుకున్నాడు. తీవ్రంగా గాయపడ్డ కుమారుడిని చికిత్స నిమిత్తం పసువందనై ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. (డబ్ల్యూహెచ్‌ఓ నుంచి వైదొలగుతాం)

తరువాత కరుప్పుస్వామి చిన్న కుమారుడు మహారాజ (26) మోటారు సైకిల్‌పై బాలమురుగన్‌ ఇంటికి వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో ఉన్న బాలమురుగన్, అతని తండ్రి కాళిపాండియన్‌ తదితరులు కరుప్పుస్వామి, మహరాజన్‌పై కత్తితో దాడిచేశారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అదే అక్కడికక్కడే మృతిచెందారు. తరువాత బాలమురుగన్‌ అక్కడి నుంచి పారిపోయాడు. మణియాచ్చి ఎస్పీ రవిచంద్రన్‌ పసువందనై పోలీసు ఇన్‌స్పెక్టర్‌ మణిమొళి, ఎస్‌ఐ ఎవనేషన్‌ ఆదిలింగం తదితరులు కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి బాలమురుగన్‌ తండ్రి కాళిపాండియన్‌ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాలమురుగన్‌ కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top