రుణం పేరుతో మహిళలకు టోకరా

Fake Bank Employee Cheated In bank And Stolen Gold Jewellery In Guntur - Sakshi

బ్యాంకు ఉద్యోగినంటూ హడావుడి

బంగారు నగలుతో ఉడాయింపు

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

గుంటూరు : బాపట్ల బ్యాంకు ఉద్యోగినంటూ బ్యాంకులో కొద్ది సేపు హడావుడి చేసి ఇద్దరు మహిళల వద్ద ఆరు సవర్ల బంగారు ఆభరణాలతో ఓ నిందితుడు ఉడాయించిన ఘటన బాపట్లలో గురువారం తీవ్ర సంచలనం రేకేత్తించింది. బ్యాంకులో హడవుడి చేసిన నిందితుడు మహిళల ఇంటికి వెళ్లి అక్కడ వ్యాపారానికి సంబంధించిన ఫోటోలు తీసి సంతకాలు పెట్టించి మరీ బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. బాధిత మహిళలు కె.మరియమ్మ, అలిదిరాణి తెలిపిన వివరాలు మేరకు కొత్తకంకటపాలెంకు చెందిన కె.మరియమ్మ, అలిదిరాణి చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్టేట్‌బ్యాంకులో ముద్రరుణాలు ఇస్తున్నారని తెలుసుకుని గురువారం ఉదయం బ్యాంకుకు వచ్చి అక్కడ పీబీడీ మేనేజర్‌ను కలిశారు.

బ్యాంకు ఇప్పుడు రుణాలు ఇవ్వటం లేదని అతను చెప్పటంతో వెనుదిరిగేందుకు యత్నించిన మహిళలను గమనించిన 30 ఏళ్లలోపు వయస్సు ఉన్న యువకుడు ఓ ఐడీ కార్డుతో వారిని పలకరించాడు. ముద్రరుణాలు కాకుండా మీకు ఒక్కొక్కరికి రూ.3.50లక్షలు వచ్చేవిధంగా వ్యాపారానికి సంబంధించిన రుణాలు ఇప్పిస్తానంటూ చెప్పాడు. మహిళలు ఇంటి వద్ద వారు చేస్తున్న చిరువ్యాపారాలను చూపించాలంటూ నిందితుడు కోరటంతో సరేనన్నారు. వెంటనే బ్యాంకు కిందకు దిగి అప్పటికే అక్కడ ఉన్న ఆటోలో కొత్తకంకటపాలెంకు బయలుదేరారు. ఇంటి వద్ద ఉన్న బొంకును ఫోటోలు తీయటంతోపాటు వారితో బ్యాంకు రుణాలకు సంబంధించిన పత్రాలుగా చెప్పి సంతకాలు చేయించుకున్నాడు. మళ్లీ అదే ఆటోలో తిరిగి బ్యాంకుకు వచ్చి రుణాలు తీసుకోవాలంటూ ముందు బ్యాంకులో ఏదో ఒక రుణం తీసుకోవాలని, బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకోవాలని నమ్మబలికాడు. సరేనని వారి వద్ద ఉన్న గొలుసులు, బంగారు గాజులు అతడికి ఇచ్చారు. అతను తూకం వేయించుకుని వస్తానంటూ చెప్పి ఇలోపు ఫోటోలు దిగి రావాల్సిందిగా చెప్పారు. మహిళలు ఫొటోలు దిగి వెళ్లి విచారించగా అతను కనిపించకుండా ఉడాయించారు.

ఆటో డ్రైవర్‌పై కూడా అనుమానాలు..
మహిళలు వారి వ్యాపారాలు చూపించాలని చెప్పి కిందకు దిగిరాగానే అప్పటికే సిద్ధంగా ఉన్న ఆటోలో మహిళలతోపాటు నిందితుడు ఎక్కాడు. అయితే ఆటో డ్రైవర్‌ కూడా సార్‌ మంచోడమ్మ అంటూ చెప్పటం...మీకు లోన్‌ వెంటనే ఇప్పిస్తాడంటూ చెప్పటంతో అతడి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసును దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
కేసును పట్టణ ఎస్‌ఐ అనిల్‌రెడ్డి నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్టేట్‌బ్యాంకులోని సీసీ కెమెరాలలో నిందితుడు గురించి ఆరా తీశారు. నిందితుడినికి సంబంధించిన చిత్రాలు కూడా దొరికినట్లు సమాచారం. అయితే స్టేట్‌బ్యాంకు ఉద్యోగులు, సెక్యూర్టీ విభాగం ఏమి చేస్తున్నారనేది ఖాతాదారులలో చర్చానీయాంశమైంది. అసలు బయట వ్యక్తి వద్ద ఐడీ కార్డు ఎందుకు ఉంది. ఐడీ బ్యాంకుదా? కాదా ఎవరికి సంబంధించిందనే కోణంలో విచారణ చేపట్టారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top