నా చావుకు ఎవరూ బాధ్యులు కారు

Engineering Student Commits End Lives in Kurnool - Sakshi

బతకడం ఇష్టం లేదు.. అందుకే చనిపోతున్నా

అవయవాలు దానం చేయండి...  

ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

కర్నూలు: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. ఇంట్లో వారిని ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు. బతకడం ఇష్టం లేకే చనిపోతున్నా. నా అవయవాలు దానం చేయండి’. అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కర్నూలులో కలకలం రేపింది. 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జొహరాపురంలో నివాసముంటున్న వెంకటరెడ్డి, శకుంతల రెండవ కుమారుడు గోవర్ధన్‌ చౌదరి(22) బీటెక్‌ పూర్తిచేశాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి గోవర్ధన్‌చౌదరి ఇంటి వద్దే ఉంటూ ఎప్పుడూ సెల్‌ఫోన్‌ చూసుకుంటూ మౌనంగా ఉండేవాడు. వీరు నివాసముంటున్న ఇంటిపైన రెండో అంతస్తు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి మిద్దెపైకెక్కి సూసైడ్‌ నోట్‌ రాసి సమీపంలో పెట్టి నిర్మాణంలోనున్న గది ఇనుపరాడ్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి 1వ పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాల గురించి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.(ఉసురుతీసిన క్షణికావేశం)

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య
కర్నూలు: కర్నూలు నగరం ధర్మపేటకు చెందిన మాధన్న కూతురు సుజాత(17) ఇంటర్‌ సెకండియర్‌ ఫెయిలైనందుకు మనస్తాపంతో కేసీ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు...మాధన్న కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. ఇందులో మూడో కుమార్తె సుజాత పత్తికొండలోని గురుకుల పాఠశాలలో ఇంటర్‌ చదివింది. అయితే రెండ్రోల క్రితం విడుదలైన ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్‌ అయ్యింది. ఈ విషయం తెలుసుకుని తల్లి సుజాత మందలించడంతో మనస్తాపానికి గురైంది. సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో బయటికెళ్లి కాలనీ శివారులోని కేసీ కెనాల్‌లో దూకింది. సుజాత రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై కాలనీ అంతా గాలించినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మధ్యాహ్నం కేవీఆర్‌ కాలేజీ సమీపంలో సుజాత ధరించిన పైట నీటిపై కన్పించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. నీటిలో మునిగివున్న బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే 2వ పట్టణ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడకు చేరుకుని నీటిలోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top