అసాంఘిక శక్తుల అడ్డాగా ‘గాంధీ’ ప్రాంగణం

Drunkers And Smugglers in Gandhi hospital Area - Sakshi

పట్టించుకోని పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది

గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి ప్రాంగణం అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది.  రాత్రి వేళల్లో మందుబాబులు, జేబుదొంగలు యథేచ్ఛగా సంచరిస్తూ మద్యం సేవిస్తూ ఆస్పత్రి ప్రాంగణాన్ని పర్మిట్‌రూమ్‌గా మార్చేస్తున్నా పోలీసులు, ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది  పట్టనట్లు వ్యవహరిస్తున్నారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వైద్యసేవల నిమిత్తం నిత్యం గాంధీ ఆస్పత్రికి వస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి కుటుంబసభ్యులు, సహాయకులు రాత్రి వేళల్లో ఇక్కడే బస చేస్తారు. యాచకులు, చిత్తుకాగితాలు ఏరుకునే వారితో పాటు జేబుదొంగలు, చిల్లర దొంగలు ఇక్కడే తిష్ట వేసి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని బెదిరించి డబ్బులు, సెల్‌ఫోన్లు లాక్కుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. అవుట్‌ పోస్‌ పోలీసులు, స్పెషల్‌ రాపిడ్‌ ఫోర్స్‌ పోలీసులతోపాటు ఆస్పత్రికి చెందిన ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ ఫలితం లేదని రోగి సహాయకులు విమర్శిస్తున్నారు. రాత్రి సమయాల్లో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు ఆస్పత్రి పాలనయంత్రాంగానికి ఫిర్యాదులు అందుతున్నాయి. తక్షణమే పోలీసులతోపాటు ఆస్పత్రి పాలనయంత్రాంగం స్పందించి అసాంఘిక శక్తుల నుంచి రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.  

చర్యలు తీసుకుంటాం
రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. పోలీస్‌ ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం, ఆస్పత్రి సెక్యూరిటీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం.–డాక్టర్‌. శ్రవణ్‌కుమార్‌  ఆస్పత్రి సూపరింటెండెంట్‌ 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top