మరో మృగాడు!

Drunken Man Assault On Young Women In Local Train - Sakshi

లోకల్‌ రైల్లో యువతిపై అత్యాచారయత్నం

యువకుడి అరెస్ట్‌

రైల్వేఎస్‌ఐ సాహసంతో రక్షింపు

ఓ యువకుడు పూటుగా మద్యం సేవించి ఉన్నాడు.. కన్నుమిన్ను కానరాని మైకంలోఉండగా రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నయువతిపై అతని కన్నుపడింది. పక్క బోగీలో ఉన్న రైల్వే ఎస్‌ఐ సాహసంతో దుండగుడి బారినపడిన యువతి అత్యాచారయత్నానికి గురై అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతోబయటపడింది. ఈ సంఘటనతో ఆ యువతి మానసికంగా కుంగిపోయింది.

సాక్షి ప్రతినిధి, చెన్నై:కదులుతున్న రైల్లో ఓ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం రాత్రి చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై బీచ్‌ నుంచి తాంబరం, చెంగల్పట్టు వరకు లోకల్‌ రైలు సర్వీసులున్నాయి. ఇవిగాక చెన్నై బీచ్‌ నుంచి వేలాచ్చేరి వరకు మెట్రోరైలు తరహాలో ఎమ్మార్టీఎస్‌ లోకల్‌ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. తెల్లవారుజాము మొదలు అర్ధరాత్రి వరకు ఎమ్మార్టీఎస్‌ రైళ్లు తిరుగుతుంటాయి. అయితే కీలక వేళలు మినహా మిగతా సమయాల్లో లోకల్‌ రైళ్ల స్థాయిలో ఎమ్మార్టీఎస్‌ రైళ్లలో ప్రయాణకుల రద్దీ ఎక్కువగా ఉండదు. తెల్లవారుజాము, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో స్వల్ప సంఖ్యలోనే ప్రయాణికులు ఉంటారు. దీన్ని కొందరు పోకిరిరాయుళ్లు, దుండగులు అవకాశంగా తీసుకుంటారు. చైన్‌స్నాచింగ్,కత్తిపోట్లు, విద్యార్థుల మధ్య ఘర్షణ వంటి సంఘటనలు అడపాదడపా చోటుచేసుకుంటున్నాయి. ఇదే కోవలో సోమవారం మరో సంఘటన చోటుచేసుకుంది.

చెన్నై వ్యాసార్పాడి హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన యువతి (28) తల్లిదండ్రులపై అలిగి ఇల్లు వదిలి చెన్నై చేరుకుంది. గిండీలోని ఒక ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి సోమవారం రాత్రి వేలాచ్చేరి రైల్వేస్టేషన్‌లో నడిచి వెళుతోంది. గుర్తుతెలియని వ్యక్తి ఆమెను అనుసరించడంతో వడివడిగా అడుగులు వేస్తూ బీచ్‌ స్టేషన్‌ వైపు వెళ్లే ఆఖరు ట్రిప్‌ ఎమ్మార్టీఎస్‌ లోకల్‌ రైలులో జనరల్‌ బోగీలో ఎక్కింది. అదే ఆఖరు రైలు కావడంతో బోగీలో ప్రయాణికుల సంఖ్య బాగా పలుచగా ఉంది. సీట్లన్నీ ఖాళీగా ఉండడంతో రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఆమె సీటులోనే పడుకుని నిద్రపోయింది. రాత్రి 11.45 గంటలకు వేలాచ్చేరిలో రైలు బయలుదేరగా సదరు వ్యక్తి యువతి ఉన్న బోగీలో ఎక్కాడు. చింతాద్రిపేట రైల్వేస్టేషన్‌లో ఆగి రైలు వేగం పుంజుకునే సమయంలో ఆమెపై అత్యాచారయత్నం చేయడంతో మెళకువ వచ్చి పెద్దగా కేకలు పెట్టింది. పక్కనున్న బోగీలో ప్రయాణిస్తున్న శివాజీ అనే రైల్వే ఎస్‌ఐ పక్క బోగీలోకి చొరబడి ఆమెపై లైంగికదాడి యత్నం చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నాడు. ఇంతలో పలువురు పోలీసులు వచ్చి అతడిని అరెస్ట్‌ చేశారు. 

ఆస్పత్రిలో చికిత్స
అత్యాచారయత్నం సమయంలో గాయపడిన యువతిని, పూర్తిగా మద్యం మత్తులో ఉన్న నిందితుడిని చెన్నై ఎగ్మూరులోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం కీల్‌పాక్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ చేశారు. బాగా స్పృహలోకి వచ్చిన తరువాత చెన్నై బీచ్‌ రైల్వేస్టేషన్‌లోని ఆర్పీఎఫ్‌ కార్యాలయంలో ఉంచి నిందితుడి విచారణ చేపట్టగా వేలాచ్చేరి లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన సత్యరాజ్‌ (26)గా తెలుసుకున్నారు. బాధిత యువతి జరిగిన సంఘటన వల్ల కుంగిపోవడంతో మానసిక చికిత్సాలయానికి పంపి చికిత్స చేయిస్తున్నారు. రైల్వేఐజీ పొన్‌మాణిక్యవేల్‌ యువతిని పరామర్శించి ధైర్యం చెప్పారు. యువతిని కాపాడడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఎస్‌ఐ శివాజీని ప్రశంసించి రూ.5వేలు బహుమతిని అందజేశారు. అరెస్టయిన నిందితుడికి కనీసం పదేళ్ల జైలుశిక్ష తప్పదని ఐజీ తెలిపారు. ఎగ్మూరు రైల్వే పోలీసలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top