తాగిన మైకంలో దాడి

Drunked Man Attack on Couple in East Godavari - Sakshi

ఒకరు మృతి ఇరువురికి తీవ్ర గాయాలు

ఇద్దరు నిందితుల పరారీ

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: కాకినాడ నగరం రెండో డివిజన్‌లోని బొందగుంటలో ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో శుక్రవారం చేసిన దాడిలో ఓ వ్యక్తి మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో గంటా పెద్దిరాజు (35) మరణించగా, కుండల ఆదినారాయణ, గంటా మహాలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. కుండల ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మహాలక్ష్మికి తలపై గాయమైంది. వివరాలు ఇలా ఉన్నాయి... కాకినాడ రూరల్‌ మండలం వలసపాకల బొందగుంటకు చెందిన కుండల దుర్గాప్రసాద్, కుండల శ్రీనివాసరావు మద్యం మత్తులో వారి పెద్దనాన్న కుండల ఆదినారాయణ ఇంటికి వెళ్లి తలుపులు కొట్టారు. తాగి గొడవ చేస్తారన్న భయంతో ఆదినారాయణ తన ఇంటి పక్కనే ఉంటున్న అల్లుడు గంటా పెద్దిరాజును పిలిచాడు. అల్లుడు వచ్చేలోపు తలుపు తీసుకొని బయటకు వచ్చిన కుండల ఆదినారాయణను తలపై ఇనుపరాడ్డుతో కొట్టారు.

మామగారిపై దాడి చేస్తుండగా అడ్డుకునేందుకు వెళ్లిన గంటా పెద్దిరాజును రాడ్లతో తలపై బలంగా కొట్టారు. అక్కడే ఉన్న పెద్దిరాజు తల్లి మహాలక్ష్మిపై కూడా దాడి చేశారు. దాడిలో పెద్దిరాజు తీవ్రంగా గాయపడగా కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లిపోయిన కుండల ఆదినారాయణకు, గాయపడిన మహాలక్ష్మికి కాకినాడ జీజీహెచ్‌లో వైద్యం అందజేస్తున్నారు. ఆదినారాయణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అసలు తమ కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు లేవని, వీరు మద్యం తాగి వచ్చి ఎందుకు ఈ దాడులకు పాల్పడ్డారో అర్థం కావడంలేదని బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. దాడికి పాల్పడిన కుండల దుర్గాప్రసాద్, కుండల శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు. మృతుడికి భార్య సుజాత, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top