నైజీరియాలో ఘోరం జరిగింది. అక్కడి ఓ గ్రామంపై క్రిమినల్ గ్యాంగులు విరుచుకపడ్డాయి. గ్రామస్థులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి వారి ఇళ్లను దగ్ధం చేశాయి. ఈ దుండగులు జరిపిన కాల్పుల్లో దాదాపు 30 మంది పౌరులు మృతిచెందారు. వీరి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అక్కడి పోలీసులు తెలిపారు.
నైజీరియా దేశంలోని నార్త్ నైజిర్ రాష్ట్రంలో కసువాన్‌జీ గ్రామంలోని ప్రజలపై శనివారం సాయంత్రం దోపిడి దొంగలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం వారి ఇళ్లను తగలబెట్టారు. అక్కడి దుకాణాలను లూటీ చేసి, పిల్లలను ఆడవారిని అపహరించారు. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించగా వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
అపహరించిన వారికోసం గాలింపులు చేపడుతున్నామని దాడులు జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బలగాలను మెహరించామని అక్కడి పోలీసులు తెలిపారు. అయితే దాడులు జరుగుతున్న సమాచారం పోలీసులకు తెలిపామని అయినప్పటికీ సరైన సమయానికి వారు అక్కడికి చేరుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా నైజిరియాలో చాలాకాలంగా గ్యాంగ్ దాడుల కాల్పులు, పిల్లలు, ఆడవారి అపహరణ చాలా కామన్‌గా మారింది. ఉత్తర నైజిరియాలో పేదరికం తీవ్రంగా ఉంది. దీంతో అక్కడి యువత క్రిమినల్ గ్యాంగులలో చేరుతూ దోపిడీ అపహరణలు జీవన ఆధారంగా మలుచుకుంటున్నారు. పిల్లలను, ఆడవారికి అపహరించి రాన్సమ్ ( విడుదలకు చెల్లించే డబ్బు) డిమాండ్ చేస్తున్నారు.


