వీడని జంట హత్యల మిస్టరీ

Double Murder Case Mystery Still Pending in Srikakulam - Sakshi

ప్రత్యేక బలగాలతో నగరాన్నిజల్లెడ పట్టిన పోలీసులు

తెలిసిన వారి పనేనని అనుమానం!

శ్రీకాకుళం రూరల్‌: జిల్లాలో సంచలనం సృష్టించిన అత్తాకోడళ్ల దారుణ హత్య ఘటనకు సంబంధించి మిస్టరీ ఇంకా వీడలేదు. దోషులను గుర్తించేందుకు పోలీసులు శుక్రవారం దర్యాప్తు ముమ్మరం చేశారు. అయినా ఎలాంటి స్పష్టత లభించలేదు. శ్రీకాకుళంలోని చాపురం పంచాయతీ బొందిలీపురం విజయ్‌నగర్‌ కాలనీలో గురువారం రాత్రి జోహాన్‌బాయ్, ఆమె కోడలు మెహర్‌ ఉన్నీషా దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. జంట హత్యలకు పాల్పడిన వారు కరుడు గట్టిన నేరగాళ్లా.. లేక కుటుంబ సభ్యులకు దగ్గర బంధువులా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మృతదేహాలను గురువారం రాత్రి అదే ఇంట్లో ఉంచేసి శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. సాయంత్రం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీకాకుళం డీఎస్పీ భీమారావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం డివిజన్‌తో పాటు విజయనగరం పోలీసులు కూడా నగర పరిసర ప్రాంతాలను జల్లెడపట్టారు.

ఏం జరిగిందో..?
తల్లీ, భార్యను కోల్పోయిన జిలానీ.. నగర కేంద్రంలోని డేఅండ్‌ నైట్‌ జంక్షన్‌లో ప్రిన్స్‌ ఫుట్‌వేర్‌ షాపును నిర్వహిస్తున్నాడు. ఈయనకు అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లతో ఎటువంటి తగాదాలు లేవని సమాచారం. అలాంటప్పుడు అత్యంత దారుణంగా జంట హత్యలకు పాల్పడిన నేరగాళ్లు ఎవరన్నది పోలీసులకు సవాల్‌గా మారింది. ఓ వ్యక్తి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి జిలానీ పిల్లల కోసం క్యారేజ్‌ తీసుకెళ్లడం, అదే రోజు జిలానీ ఊర్లో లేకపోవడం, పిల్లలు వచ్చే సమయానికి డోర్‌ లాకవ్వడం, సాయంత్రానికి రెండు మృతదేహాలు రక్తపు మడుగుల్లో పడి ఉండటం మిస్టరీగా మారింది. ఈ కోణాల్లోనే పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అనుమానాలెన్నో..
వాస్తవంగా దొంగతనానికి వచ్చిన వారు దొరికినంత దోచుకుపోతారు తప్ప హత్యలకు పా       ల్పడిన దాఖలాలు జిల్లాలో అంతగా లేవు. హంతకుడు తలుపులు బార్లా విడిచిపెట్టి పారిపోతాడు తప్ప లోపల మృతదేహాలను ఉంచి తాళాలు వేసి పరారయ్యే అవరసరం ఏముందనేది ప్రశ్నగా మారింది. నేరగాళ్లు చేసిన పనికాదని, బాగా పరిచయస్తులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడితే కేకలు, అరుపులు వినిపించేవని, ఇక్కడ మాత్రం అటువంటిదేమీ జరగలేదని స్థానికులు చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు డబ్బు, బంగారం దొంగిలించిన వ్యక్తులు అడ్డదారులనే ఆశ్రయిస్తారు. ఇక్కడ మాత్రం హత్య జరిగిన ప్రదేశం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారానే ద్వారకానగర్‌ వరకూ సుమారు రెండు కిలోమీటర్లు వెళ్లినట్లు డాగ్‌స్క్వాడ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. దొంగలు నిజంగానే చోరీకి వస్తే బీరువాలో దుస్తులు, ఇతరత్రా వస్తువులను చిందరవందరగా పడేస్తారు. ఇక్కడ మాత్రం దుస్తులన్నీ చక్కగా మడత పెట్టే ఉండటం,  సోఫాసెట్‌పై సూట్‌కేసులు, ఇతర వస్తువులు యథాతథ స్థానంలో ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

అదుపులో నలుగురు అనుమానితులు?
డాగ్‌ స్క్వాడ్‌ వెళ్లిన ఏరియాలో రెండు, హత్య జరిగిన ప్రాంతంలో రెండు సీసీ టీవీల ఫుటేజీలు పోలీసులు సేకరించారు. ఈ సంఘటనకు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.  

పక్కా స్కెచ్‌ ప్రకారమే..
దుండగుల దాడిలో గాయపడి వ్యక్తులు ఎవరైనా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కనీసం గోడలకు కాసింత రక్తపు మరక కూడా అంట కుండా, మంచినీరు ట్యాప్‌ను విడిచిపెట్టి నీటిలో రక్తం కలిసిపోయేలా హంతకులు జాగ్రత్తపడ్డారు. హత్య ఆనవాళ్లు గుర్తుపట్టకుండా కారం చల్లినట్లు పోలీసులు గుర్తించారు.

పోస్టుమార్టంలో తేలిందిదీ..
హత్య చేసిన వ్యక్తి ముందుగా బ్యాట్‌తో ఇద్దరు మహిళల తలౖలపె బలంగా కొట్టడంతో ఒక్కసారిగా కోమాలోకి వెళ్లిపోయినట్లు పోస్టుమార్టంలో వెల్లడైనట్లు తెలిసింది. తర్వాత పదునైన చాకుతో మెడ, రెండు చేతులు, మణికట్టుపై విచక్షణ రహితంగా కోసేసిన ఆనవాళ్లు గుర్తించారని సమాచారం. సైకోలాంటి వ్యక్తులే ఇలాంటి దారుణాలకు ఒడిగడతారని పోలీసులు చెబుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top