షర్మిలపై దుష్ప్రచారం కేసులో నిందితుడి వ్యాజ్యం కొట్టివేత 

Dismissal of the offender pill in the Fake News On  YS Sharmila  Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రతిపక్షనేత వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వై.ఎస్‌ షర్మిలపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన కేసులో నిందితుడు పెద్దిశెట్టి వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. షర్మిల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ఏపీలోని ప్రకాశం జిల్లా వేముల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  

షర్మిల ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్‌ చేసి సెక్షన్‌ 509 ఐపీఎస్, 67 ఐటీ యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేశారు. కేసులను కొట్టేయాలని కోరుతూ వెంకటేశ్వర్లు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఓ మహిళపై అత్యంత అసభ్యకరంగా పోస్టులు పెట్టారని అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ విజారత్‌  తెలిపారు. ఓ సినీనటుడుతో సంబంధాలు అంటగడుతూ పోస్టింగ్‌లు పెట్టి ఆ మహిళ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారన్నారు. ఇటువంటి విషయాలను తేలిగ్గా తీసుకోరాదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top