పగ పెంచుకుని.. అమ్మను చంపేశారు..

Daughters Killed Mother In Nalgonda District - Sakshi

డబ్బులు ఇవ్వడం లేదని కుమార్తెల ఘాతుకం 

తన జీవితాన్ని నాశనం చేసిందని పగపెంచుకున్న కూతురు

చెల్లికి సహకరించిన అక్క, మరో వ్యక్తి

నల్లగొండ క్రైం : కన్న తల్లిని గొంతు నులిమి హత్య చేశారు ఇద్దరు కుమార్తెలు. అడిగితే డబ్బులు ఇవ్వడం లేదని, తమను సరిగా చూసుకోవడం లేదని పగ పెంచుకుని వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వారికి గుల్యాని చిన్న జంగయ్య అనే వ్యక్తి సహకరించాడు. ఈ ఘటన నల్లగొండ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు. నల్లగొండ మండలంలోని అప్పాజి పేట గ్రామానికి చెందిన కల్లూరి సత్తెమ్మ (50)కి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సత్తెమ్మ భర్త 20 ఏళ్ల క్రితమే మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన కూరాకుల యాదయ్యతో సత్తెమ్మకు వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే రుద్రమ్మను 16ఏళ్ల వయసులో యాదయ్యకి ఇచ్చి వివాహం చేసింది. వీరికి ఓ కూతురు. వివాహం జరిగిన 10 ఏళ్ల తర్వాత యాదయ్య, రుద్రమ్మకు మధ్య అభిప్రాయభేదాలు రావడంతో పెద్దమనుషుల సమక్షంలో విడిపోయారు.

ఈ క్రమంలో రుద్రమ్మ తన కూతురు నిఖితతో కలసి చౌటుప్పల్‌లో కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తోంది. వేరుగా ఉంటున్న రుద్రమ్మను కాపురానికి పంపాలని యాదయ్య సత్తెమ్మపై పలుమార్లు ఒత్తిడి చేశాడు. దీంతో తల్లి సత్తెమ్మ కుమార్తెను యాదయ్య దగ్గరకు వెళ్లాలని చెప్పడంతో అందుకు రుద్రమ్మ నిరాకరించింది. సంసారానికి రాకుంటే పరువు తీస్తానని యాదయ్య రుద్రమ్మకు ఫోన్‌ చేసి వేధించాడు. దీంతో తల్లి వల్ల తన జీవితం నాశమైందని రుద్రమ్మ సత్తెమ్మపై పగ పెంచుకుంది. 

హత్య చేసింది ఇలా..
కుటుంబ అవసరాలకు బంగారం, నగదు ఇవ్వాలని తల్లి సత్తెమ్మను రుద్రమ్మ అనేక సార్లు అడిగింది. సత్తెమ్మ ఒకసారి మూడు తులాల బంగారం ఇచ్చింది. ఆ తర్వాత రద్రమ్మ వద్దకు బంగారం మళ్లీ ఇస్తానని చెప్పి తీసుకెళ్లింది. ఈ క్రమంలో కుటుంబం గడవడం లేదని, ఆర్థికంగా సాయం చేయాలని రుద్రమ్మ అడిగినా.. తల్లి నిరాకరించింది. ఇదే విషయాన్ని అక్క అండాలుకు చెప్పడంతో నాకూ ఎలాంటి సాయం చేయడంలేదని ఆమె తెలిపింది. అవసరాలకు ఆదుకోవకపోవడంతో ఎలాగైనా సత్తెమ్మను అంతమొందించాలని కుమార్తెలు నిర్ణయించుకున్నారు. దీంతో చౌటుప్పల్‌లో నివాసం ఉంటున్న చిన్న జంగయ్య సాయం తీసుకున్నారు. ముగ్గురూ కలసి అక్టోబర్‌ 10న తల్లివద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని గొడవపడ్డారు. అందుకు నిరాకరించడంతో తల్లి సత్తెమ్మను నెట్టివేసి.. చేతులు వెనక్కి విరిచి గొంతుపై కాలితో తొక్కి హత్య చేశారు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత సత్తెమ్మ వద్ద ఉన్న 3 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.30 వేల నగదు తీసుకుని వెళ్లిపోయారు. కుమారుడు సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇలా పట్టుబడ్డారు..
సత్తెమ్మ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానం వచ్చిన ఇద్దరు కుమార్తెలను విచారించారు. బంగారం, నగదు విషయమై పోలీసులు వీరిని విచారించగా హత్య విషయాన్ని వెల్లడించారు. దీంతో వారి వద్ద ఉన్న 3 తులాల బంగారం, 30 వేల నగదు, బైక్, 3 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఇన్‌చార్జ్‌ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top