ట్రాక్టర్‌తో తొక్కించి.. కల్టివేటర్‌తో చుట్టేసి..

daughter kill father over property dispute in jagtial - Sakshi

మామను కిరాతకంగా చంపిన అల్లుడు, కూతురు

ఆస్తి వివాదమే కారణం

సారంగాపూర్‌ (జగిత్యాల): ఆస్తి ముందు వారికి అనుబంధాలు కనిపించలేదు. భర్తతో కలసి కూతురే తన తండ్రి ప్రాణాలను తీసింది. ఆదివారం జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలంలో ఈ దారుణ సంఘటన జరిగింది. సారంగాపూర్‌ మండలం రేచపల్లికి చెందిన పూరెల్లి మల్లయ్య(48) కుమార్తె జల అలియాస్‌ కావ్యను పదేళ్ల క్రితం రేచపల్లికి చెందిన దీటి కొమురయ్యకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ సమయంలో కట్నం కింద రెండెకరాల భూమి, రూ.5 లక్షలు ఇచ్చాడు. 

మల్లయ్య  మిగిలిన నాలుగెకరాల భూమిని సాగు చేసుకుంటున్నాడు. అయితే ఆ నాలుగెకరాలను సైతం తామే సాగు చేసుకుంటామని అల్లుడు, కూతురు  ఇటీవల దున్నారు. విషయం తెలుసుకున్న మల్లయ్య తిరిగి అదే భూమిని ట్రాక్టర్‌ తో దున్నించాడు. ఈ క్రమంలో అల్లుడు, కూతురు ఆదివారం ఉదయం అదే భూమిలో పసుపు, మొక్కజొన్న వేసేందుకు వెళ్లగా మల్లయ్య, అతని తండ్రి గంగారాం అక్కడికెళ్లి నిలదీశారు. ట్రాక్టర్‌కు అడ్డుగా వెళ్లి నిల్చున్నారు. దీంతో కోపోద్రిక్తురాలైన కూతురు  తండ్రిని నెట్టివేసింది. అల్లుడు ట్రాక్టర్‌ను మల్లయ్య మీదికి తోలాడు.

ట్రాక్టర్‌ అతనిమీది నుంచి దాట గానే కల్టివేటర్‌తో మల్లయ్య చనిపోయే వరకు పొలంలోనే చక్కర్లు కొట్టించాడు. ఈ విషయాన్ని గమనిస్తున్న పక్క పొలంలో ఉన్న మల్లయ్య అన్న గంగారెడ్డి అడ్డుకునేందుకు పరుగెడుతూ వస్తుండగా.. ‘రారా! మీ తమ్ముడిని చంపినట్లు నిన్ను కూడా తొక్కిస్తా..’అంటూ కొమురయ్య అరవడంతో అక్కడే పనిచేస్తున్న కూలీలు గంగారెడ్డిని అడ్డుకున్నారు. మల్లయ్య చనిపోయాడని నిర్ధారించుకున్న అల్లుడు, కూతురు  ట్రాక్టర్‌పై ఇంటికెళ్లి, అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యారు.   అల్లుడు, కూతురు సాయంత్రం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top