ఈ అడ్డాల వద్ద జర భద్రం బిడ్డా..!

Dangerous Addas In Rangareddy District Where Women Feel Not Safe - Sakshi

అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలు 

యథేచ్ఛగా తిరుగుతున్న పోకిరీలు  

​​​​​​భయం గుప్పిట్లో మహిళలు

శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలు, కల్వర్టులు, బ్రిడ్జిలు, గోదాములు,  అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. పోకిరీలు, మందుబాబులు, పేకాటరాయుళ్ళు, గంజాయి తీసుకునేవాళ్లకు ఇవి కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యాయి. రాత్రి పొద్దుపోయేదాక కొందరు ఇక్కడే మకాం వేస్తుండటం గమనార్హం. దీంతో ఈ ప్రాంతాల గుండా వెళ్లేందుకు మహిళలు, యువతులు  జంకుతున్నారు.  రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో ఇలాంటి ‘అడ్డా’లపై సాక్షి బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.  

వణుకు పుట్టిస్తున్న చటాన్‌పల్లి

చటాన్‌పల్లి శివారులోని ఈ బ్రిడ్జి కిందే పాశవిక ఘటన చోటుచేసుకుంది

బైపాస్‌ రోడ్డులోని సర్వీస్‌రోడ్డు పక్కన  పెరిగిన ముళ్లచెట్లు

షాద్‌నగర్‌టౌన్‌: మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చటాన్‌పల్లి శివారులో 44వ జాతీయ రహదారి కిందే పాశవిక దుర్ఘటన జరిగింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే రహదారి ఇది. సంఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే బైపాస్‌ కూడలి, హోటళ్లు, దాబాలు ఉన్నాయి. ఈ రహదారి పై పోలీసుల పెట్రోలింగ్‌ వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. కాని కింద జాతీయ రహదారి  పక్కన ఉన్న సర్వీస్‌ రోడ్డు, ఇక్కడ ప్రాంతాలు అత్యంత నిర్మానుష్యంగా ఉంటాయి. ఈ సర్వీసు రోడ్డు ఇరువైపులా మొత్తం ముళ్లు, కంప చెట్లు ఉంటాయి. కొత్తూరు దాటిన తర్వాత జాతీయ రహదారి పై షాద్‌నగర్‌ వరకు బైపాస్‌ గుండా సీసీ కెమెరాలు లేక పోవడంతో నిఘా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి వేళల్లో  స్తంభాలకు కనీసం వీధి లైట్లు కూడా లేక పోవడం పలు అనర్థాలకు కారణం అవుతోంది. నిరంతం పెట్రోలింగ్‌ వ్యవస్ధను కొనసాగించడం, సర్వీసు రోడ్లను అభివృద్ధి చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వార ప్రమాదాలను నివారించేందుకు అవకాశం ఉంది. ‘జస్టిస్‌ ఫర్‌ దిశ’ ఘటన షాద్‌నగర్‌ ప్రాంతానికి భాగస్వామ్యం  ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

దారుణాలు అనేకం 
మహిళలను దారుణంగా హతమార్చి షాద్‌నగర్‌  ప్రాంతంలో పడేసి పోవడం, మహిళలపై అత్యాచారాలు చేసి హత్యలు చేయడం వంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి.  అయితే గతంలో 2007లో షాద్‌నగర్‌ ప్రాంతంలో 11 మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. వరుస హత్య సంఘటనలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అప్పట్లో ఈ సంఘటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి. వరుస హత్య కేసుల మిస్టరీని చేజించేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది.  అయితే వివిధ ప్రాంతాల నుండి మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి అత్యాచారం హత్య చేసిన సంఘటనలు షాద్‌నగర్‌ ప్రాంతం ప్రజల మనస్సుల్లో ఇంకా మెదులుతూనే ఉన్నాయి.   పోలీసులు ఇకనైనా మేలుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

అక్కడికి వెళ్తే ఇక అంతే..?

రావిర్యాల ఆర్‌సీఐ రోడ్డులో భయానక పరిస్థితులు 

తుక్కుగూడ: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శ్రీశైలం హైవే రోడ్డు నుంచి ఆర్‌సీఐ రోడ్డులో ప్రభుత్వ భూములతో పాటు, అటవీ భూములు విస్తరించాయి. ఈ భూములు జనావాసాలకు దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు వేదికలుగా మారాయి. నిత్యం హైదరాబాద్‌ నుంచి యువత ఈ రోడ్డు నుంచి రావిర్యాలలో ఉన్న వండర్‌లాకు పర్యటన కోసం వస్తూ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది ఇక్కడ ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు అత్యచారం చేసి అంతమొందించారు. అప్పటి నుంచి ఈ రోడ్డు వెంట వెళ్లాలంటే ప్రయాణికులు జంకుతున్నారు. ముఖ్యంగా రాత్రి వెళ్లడమంటే.. సాహసం చేయడమే. ఇటువంటి భయానక పరిస్థితులు ఉన్నా పోలీసులు పెద్దగా నిఘా పెట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

వెంచర్లలో తిష్ట..

రాత్రి వేళ మందుబాబులకు నిలయం..

శంషాబాద్‌: పట్టణం పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూఅదుపూ లేదు. పట్టణం చుట్టూ విస్తరించిన వెంచర్లన్నీ దాదాపుగా మదుబాబులకు కేంద్రాలుగా మారుతున్నాయి. కొన్ని వెంచర్ల చుట్టూ ప్రహరీలు, అందులో ఓ గది నిర్మించి గాలికి వదిలేస్తున్నారు. ఇటువంటి వెంచర్లలో  జులాయిలు జల్సాలు చేస్తున్నారు.సింప్లెక్స్‌ ఉన్న నిర్మానుష ప్రాంతంలో నిత్యం మందుబాబులకు అడ్డాగా మారుతోంది. రాళ్లగూడ, తొండుపల్లి, ఊట్‌పల్లి, సిద్ధులగుట్ట మార్గం, కొత్వాల్‌గూడ, హుడా కాలనీల్లో మద్యం తాగిన సందర్భంలో అనేకసార్లు గొడవలు జరిగాయి. శంషాబాద్‌ పట్టణం నుంచి నర్కూడ వైపు వెళ్లే దారిలో వెంచర్లలో నిత్యం మందుబాబులు తిష్ట వేస్తుంటారు. గగన్‌పహాడ్‌ ట్రాన్స్‌జెండర్లకు అడ్డాగా మారింది. చీకటి పడితే ఇక్కడ చాలు పదుల సంఖ్యలో ట్రాన్స్‌జెండర్లు దారి వెంట రాకపోకలు జరిపేవారిని ఆకర్షిస్తూ జుగుప్సాకరంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రహదారి పక్కనే ఓ మూతబడిన మద్యం కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలో అన్ని కార్యకలాపాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

 చీకటి పడితే భయమే..

తుర్కయంజాల్‌ మాసాబ్‌ చెరువు వద్ద గల రాతి నిర్మాణం

తుర్కయంజాల్‌: నగర శివారు ప్రాంతమైన తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలో నాగార్జునసాగర్‌ రహదారిపై గల మాసాబ్‌ చెరువు కట్ట మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి పడిందంటే చాలు ఇక్కడ బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. రాత్రి 10 గంటల వరకు ఇదే పరిస్థితి. ముఖ్యంగా వాహనాలను రోడ్డు పక్కన నిలిపి మద్యం తాగడం ఇక్కడ నిత్యం జరిగే తంతు. ఈ చెరువు తూము వద్ద గల రాతి కట్టడంపై పొద్దుపోయేవరకు యువతీ యువకులు అక్కడే కాలక్షేపం చేస్తుంటారు. చెరువుకు రెండు పక్కలా నిర్మానుష ప్రాంతాలు ఉంటాయి. కట్టపై అంతంత మాత్రంగానే పోలీసుల గస్తీ ఉంటుంది. కొన్ని సార్లు అక్కడి నుంచి పెట్రోలింగ్‌ వాహనాలు వెళ్లినా.. మద్యం సేవిస్తున్న వారిని ఏమనక పోవడం గమనార్హం. 

నిత్యం మద్యం బాటిళ్లు, పేకాటకార్డులు దర్శనం

భయంగొల్పుతున్న ఇబ్రహీంపట్నం పాత బస్టాండ్‌ గోదాం 

ఇబ్రహీంపట్నం: పట్టణంలోని పాత బస్టాండ్‌ గోదాముల్లో, పాత పోలీస్‌ స్టేషన్, వినోభానగర్‌లో అసంపూర్తిగా నిర్మాణం నిలిచిన డిగ్రీ కళాశాల భవనాలు ఆసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి. పోకిరీలు, మందుబాబులు, పేకాటరాయుళ్ళు, గంజాయి తీసుకునేవాళ్లు  ఇక్కడే తిష్ట వేస్తున్నారు. రాత్రిళ్లు పొద్దు పోయేవారు ఇక్కడే మకాం వేస్తున్నారు. డిగ్రీ కళాశాలలో మద్యం బాటిళ్ళు, పేకాట కార్డులు దర్శనమిస్తున్నాయి. పాత బస్టాండ్‌ గోదాంల వద్ద ఉదయం నుంచి బైక్‌లు అడ్డంగా పార్క్‌చేసి గంటల తరబడి అక్కడే టైంపాస్‌ చేస్తున్నారు. మందుబాబులు, పోకిరీలు రాత్రిళ్ళు బైఠాయిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

 కళాశాల భవనంలోని ఓ గదిలో ఖాళీ మద్యం సీసాలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top