క్రికెట్‌ బుకీల అరెస్టు

Cricket Bookies Arrest In YSR Kadapa - Sakshi

రూ.2 లక్షల 20 వేల నగదుతో పాటు సెల్‌ఫోన్‌లు,రెండు కిలోలగంజాయి స్వాధీనం

వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ మాసూం బాషా

వైఎస్‌ఆర్‌ జిల్లా,ఎర్రగుంట్ల :  పాకిస్తాన్‌– బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన ఆసియా కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఎనిమిది మంది  క్రికెట్‌ బుకీలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,20,200లు నగదు తోపాటు రెండు కిలోల గంజాయి, ఐదు సెల్‌ ఫోన్‌లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ మాసూం బాషా తెలిపారు.  గురువారం ఎర్రగుంట్లలోని సీఐ కార్యాలయంలో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని మాలెపాడు గ్రామంలో క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతన్నారని సమాచారం అందడంతో ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డి, కలమల్ల ఎస్‌ఐ చిరంజీవిలతో పాటు పోలీస్‌ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కలసి దాడి చేశారన్నారు.

గ్రామానికి చెందిన వేగిలిశెట్టి వెంకటేష్‌ ఇంటి ముందు టీవీలో క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న మాలెపాడుకు చెందిన వేగిలిశెట్టి వెంకటేష్, కర్నూలు జిల్లా గోస్పాడు మండలం ఎం.చింతకుంట గ్రామానికి చెందిన కనాల శ్రీధర్‌లతో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,20,200లు నగదు తోపాటు రెండు కిలోల గంజాయిని, ఐదు సెల్‌ ఫోన్‌లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన వారిలో మాలెపాడుకు చెందిన గుండ్లదుర్తి చిన్నరెడ్డి, ఇల్లూరు రాజేశ్వర్‌రెడ్డి, పసల చిన్న ఓబులపతి, పామిడి సురేంద్ర, గజ్జల సుబ్బయ్య, కలమల్ల గ్రామానికి చెందిన అంకనపల్లి అశ్వర్థ రెడ్డి ఉన్నారని చెప్పారు. క్రికెట్‌ బుకీలను అరెస్టు చేయడానికి కృషి చేసిన ఎర్రగుంట్ల సీఐ కొండారెడ్డి, కలమల్ల ఎస్‌ఐ చిరంజీవిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని, వారికి రివార్డును అందిస్తామని డీఎస్పీ తెలిపారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top