బంతి బంతికి బెట్టింగ్‌ | Sakshi
Sakshi News home page

బంతి బంతికి బెట్టింగ్‌

Published Thu, Sep 27 2018 1:24 PM

Cricket Betting In Krishna - Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో : జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌ పల్లెటూళ్లకు వ్యాపించింది. సులభ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునేవారికి క్రికెట్‌ వేదికగా మారింది. ఎందరో ఈ బెట్టింగ్‌ ఉచ్చులో చిక్కుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. దేశ భవిష్యత్తును నిర్దేశించాల్సిన యువత పందెం ఉచ్చులో చిక్కుకు పోతోంది. పేదలు మొదలుకుని సంపన్నుల వరకు బెట్టింగ్‌ ఊబిలో కూరుకుపోతున్నారు. ఆసియా కప్‌ సందర్భంగా జిల్లాలో మళ్లీ క్రికెట్‌ బెట్టింగ్‌ ఊపందుకుంది. ముఖ్యంగా ఇండియా–పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌లకు రూ. లక్షల్లో పందేలు కాస్తున్నారు. జిల్లాలో చాలామంది యువకులు క్రికెట్‌ బెట్టింగ్‌కు బానిసలవుతున్నారు. ప్రధానంగా చదువుకుంటున్న, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న చాలామంది పందేలు కాస్తున్నారు. వ్యాపారులు, చదువుకున్నవారితో మొదలైన బెట్టింగ్‌ పల్లెలకు పాకింది.

నేరాలకు పాల్పడుతూ...
ఈ క్రమంలో పలువురు దురలవాట్లకు బానిసలై బెట్టింగ్‌లో నష్టపోతూ చివరకు నేరాలకు పాల్పడుతున్నారు. స్నాచింగ్‌ వంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారంటే పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు. నష్టపోయిన కొందరు బెట్టింగ్‌ నిర్వాహకులకు ఏజెంట్లుగా మారుతున్నారు. బెట్టింగ్‌లు నిర్వహించే బుకీలు సైతం కంప్యూటర్లు వినియోగిస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో పనికానిచ్చేస్తున్నారు. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంటిలో ల్యాప్‌టాప్‌లకు అనుసంధానంగా సెల్‌ఫోన్లను ఏర్పాటు చేసి దాని ద్వారా ఏకకాలంలో దాదాపు 15 మందితో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ఒక ముఠా గుట్టు ఆదివారం రట్టయింది. ఈ ముఠా నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు, రూ. 2 లక్షల నగదు పట్టుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లోనే బెట్టింగ్‌ జరుగుతున్న తీరును చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

నిఘా అంతంత మాత్రమే..
క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగే సందర్భాల్లో బెట్టింగ్‌ కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంచడం.. అరికట్టే విషయంలో కొందరు పోలీసు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. సంస్థాగత సమస్యలు ఒక కారణమైతే పోలీసు అధికారులు అవినీతి తదితరాలు మరో ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. గత ఏడాది తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తోపాటు మన రాష్టంలోని  విశాఖపట్నం, ఏలూరు ప్రాంతాలకు చెందిన ప్రధాన బుకీలు మకాం వేసిన సంగతి వారిని అరెస్టు చేసే వరకు పోలీసు గుర్తించలేకపోయారు. ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, ముంబై కేంద్రాలుగా బెట్టింగ్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రతిరోజూ రూ. లక్షల్లో పందేలు కాస్తున్నారు. అయినప్పటికీ నిఘా ఎంత మేర ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడెక్కడంటే..
కృష్ణా జిల్లాలో.. విజయవాడ నగరంలోని భవానీపురం, సింగ్‌నగర్, కృష్ణలంక, గాంధీనగర్, గవర్నర్‌పేట, పటమట, పెనమలూరు,  గొల్లపూడి, వన్‌టౌన్‌లతోపాటు శివారు ప్రాంతాల్లోని లాడ్జీలు, బహుళ అంతస్తుల భవనాలను నిర్వాహకులు అడ్డాలుగా చేసుకుంటున్నారు. మచిలీపట్నం, హనుమాన్‌ జంక్షన్, గుడివాడ, గన్నవరం, నూజివీడు, జగ్గయ్యపేట, నందిగామ ముఖ్య పట్టణాల్లోనూ క్రికెట్‌ బెట్టింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఇతర ప్రాంతాల్లో సెల్‌ఫోన్, ఇంటర్నెట్‌ దుకాణాల నిర్వాహకులు, ఇళ్లు, లాడ్జీలు, ప్రత్యేక స్థావరాల్లో కొనసాగుతున్నాయి.

సాంకేతిక పరిజ్ఞానంతో..
క్రికెట్‌ పందేల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలో డబ్బు, చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు బెట్టింగ్‌ కాసేయొచ్చు. ఫోన్‌ ద్వారా దేనికి బెట్టింగ్‌ కాస్తున్నామో చెప్పి, ఆన్‌లైన్‌లో డబ్బు మళ్లింపు చేస్తే సరిపోతుంది. అందుకే నిర్వాహకులు మారుమూల ఇళ్లను అద్దెకు తీసుకుని అక్కడి నుంచి ఫోన్ల ద్వారా కార్యకలాపాలు నడిపిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన పలువురు విజయవాడ శివార్లలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, హోటళ్లలోని గదులు అద్దెకు తీసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తూ పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. క్రికెట్‌ బెట్టింగ్‌కు సంబంధించి ప్రత్యేక భాష వాడుకలోకి రావడంతో కొత్తవారు అర్థం చేసుకోవడం కష్ట సాధ్యంగా మారింది.

Advertisement
Advertisement