బెట్టింగ్‌ కోసమే ఓ వాట్సాప్‌ గ్రూపు..

వివరాలు వెల్లడిస్తున్న కార్తికేయ - Sakshi

జిల్లాలో క్రికెట్‌ బెట్టింగ్‌..రూ. కోట్లలో టర్నోవర్‌

ఓంలైన్‌ పేరిట వాట్సప్‌ గ్రూపు

మహారాష్ట్ర కేంద్రంగా నిర్వహణ

పోలీసుల దాడుల్లో తొమ్మిది మంది అరెస్టు

రూ. 3 లక్షలు, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం

సాక్షి,నిజామాబాద్‌ : ఐపీఎల్‌  సందడి మొదలయ్యిందంటే చాలు.. జిల్లాలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ జోరు పెరుగుతుంది. రూ. కోట్లలో టర్నోవర్‌ కాగా.. బెట్టింగ్‌లో పాల్గొంటున్న వారెందరో నిండా మునిగి పోతున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా క్రికెట్‌ బెట్టింగ్‌ సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. మహారాష్ట్ర పుణేకు చెందిన గుర్తు తెలియని ప్రధాన బూకీకి నిజామాబాద్‌లో నలుగురితో పరిచయం ఉంది. ప్రధాన సుత్రధారి  ఓంలైన్‌ పేరిట వాటప్స్‌ గ్రూప్‌ను సృష్టించి బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, లాడ్జీలు, బోధన్‌ రోడ్డు, కంఠేశ్వర్‌ ప్రాంతాలతో పాటు, ఆర్మూర్, బోధన్‌ ప్రాంతాలలో బెట్టింగ్‌ల జోరుగా సాగుతున్నట్లు సమాచారం. బెట్టింగ్‌ సంస్కృతి మండలాలకు సైతం పాకినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లో డబ్బులు వచ్చిన వారు మరికొందరిని ఈ ఉచ్చులో దింపుతున్నారు. క్రికెట్‌ ఆటపై పూర్తిగా అవగాహన ఉన్నవారికి అదృష్టం కలిసివస్తుండగా, మిగతావారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు.  జిల్లా కేంద్రంలో శుక్రవారం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతుందన్న సమాచారంతో టాస్క్‌ఫోర్సు, మూడవ టౌన్‌ పోలీసులు నగరంలో బెట్టింగ్‌ జరుగుతున్న ఇంటిపై దాడిచేయగా అసలు విషయం బయటపడింది. గతంలో బెట్టింగ్‌కు పాల్పడిన కొందరిని పోలీసులు పట్టుకుని విచారించగా ఇప్పుడు జరుగుతున్న బెట్టింగ్‌లో పాత్రదారులు పోలీసులకు చిక్కారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన కందికంటి నాగరాజుగౌడ్, గౌతంనగర్‌కు చెందిన మధుగాని బాలకృష్ణ, నాందేవ్‌వాడకు చెందిన సంత్‌పాలే జ్యోతిశ్వర్‌ భాగ్యనగర్‌కాలనీ ఖానాపూర్‌కు చెందిన పాంచాల రమేష్‌లు క్రికెట్‌ బుకీలు. వీరికి మహారాష్ట్ర పుణేకు చెందిన ప్రధాన బూకీ పరిచయం ఉంది. క్రికెట్‌ మ్యాచ్‌ మొదలైన దగ్గర నుంచి ఇతను సృష్టించిన వాట్సాప్స్‌ గ్రూపు ద్వారా బెట్టింగ్‌ సాగింది. నాగరాజు గౌడ్‌ తన ఇంటినే బెట్టింగ్‌ అడ్డాగా మార్చాడు.

బూకీలతో పాటు 80 మందిపై కేసుల నమోదు...  
నగరానికి చెందిన క్రికెట్‌ బూకీలు నాగరాజు గౌడ్‌ వద్ద 33 మంది, బాలకృష్ణ వద్ద 33 మంది, నవాతే సంజీవ్‌ వద్ద 28, జ్యోతిశ్వరం వద్ద 13 మంది, రమేష్‌ వద్ద ఆరుగురు మొత్తం 80 మంది బెట్టింగ్‌లు ఆడేవారు ఉన్నారు. బూకీల వద్ద అసిస్టెంట్లుగా పనిచేసే రమేష్‌ అలియాస్‌ నాని, భోజ్య యాదగిరి, మోరు రాంజీలు బెట్టింగ్‌ ఆడేవారి వద్ద నుంచి వివరాలు సేకరించి నమోదు చేస్తారు. గెలిచిన వారికి డబ్బులు ఇవ్వడం , ఓడిన వారి నుంచి వసూలు చేయడం వీరి పని. పోలీసులు దాడులు చేసిన సమయంలో వీరినుంచిరూ. 3లక్షల నగదు, 13 సెల్‌ఫోన్లు, నాలు గు నోట్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ శనివారం విలేకరులకు వివరాలను వెళ్లడించారు. బెట్టింగ్‌ నిర్వహణ ప్రధాన సూత్రధారి కోసం త్వరలో పుణేకు పోలీస్‌ బృందం వెళ్లనున్నట్లు సీపీ తెలిపారు. క్రికెట్‌ బూకీలను పట్టుకోవటంలో ప్రతిభ చూపిన నగర సీఐ సుభాష్‌చంద్రబోస్, టాస్క్‌ఫోర్సు సీఐ జగదీష్, చందర్‌రాథోడ్, మూడవ టౌన్‌ ఎస్సై ఆర్‌ కృష్ణ, కానిస్టేబుళ్లు సంగేష్, సర్దార్‌లను సీపీ అభినందించారు. సమావేశంలో అదనపు డీసీపీ శ్రీధర్‌రెడ్డి, ఏసీపీ సుదర్శన్, నగర సీఐ సుభాష్‌ చంద్రబోస్, ఎస్సై కృష్ణలు పాల్గొన్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top