దంపతుల దుర్మరణం

Couple Died In Car Accident Chittoor - Sakshi

మరో ఆరుగురికి గాయాలు

రెండు కార్లు ఢీకొనడంతో ప్రమాదం

అతివేగమే కారణమంటున్న స్దానికులు

అందుబాటులో లేని 108 వాహనం

దీపావళి పండుగను పుట్టినింటిలో జరుపుకోవాలని ఆమె భావించింది. కజ్జాలు తయారు చేసింది. భర్తకు రెండు రోజులు సెలవులు ఇవ్వడంతో ఇద్దరూ కలిసి సంతోషంగా కారులో బయలుదేరారు. క్షణకాలంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరూ కానరాని లోకాలకు చేరుకున్నారు. దీంతో రెండు కుంటుంబాల్లో విషాదం నెలకొంది.

చిత్తూరు , పూతలపట్టు: చిత్తూరు– తిరుపతి జాతీయ రహదారిలోని సోమవారం కారును మరో కారు ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. పులిచెర్ల మండలం కామవరం కొత్తపేటకు చెందిన రమేష్‌బాబు(59), అనూరాధ(47) దంపతులు తిరుచానూరులోని నారాయణపురం వీధిలో నివాసం ఉంటున్నారు. రమేష్‌బాబు తొట్టంబేడు మండలం కాసరం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం మంగళ, బుధవారాలు పాఠశాలలకు సెలవు ఇచ్చింది. దీంతో అనూరాధ కజ్జాలు చేసుకుని పుట్టినిల్లు అయిన బంగారుపాళెంకు భర్తతో కలిసి కారులో సోమవారం మధ్యాహ్నం బయలుదేరారు. కారును రమేష్‌బాబు నడుపుతున్నాడు. అదే సమయంలో తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా పుదుకోటైకి చెందిన రామన్‌(76), అతని కుటుంబ సభ్యులు చక్రవర్తి(39), విజయలక్ష్మి(33), సెల్వమణి(60), కావ్య(10) టవేరా  కారును అద్దెకు తీసుకుని తిరుమలకు బయలుదేరారు. పూతలపట్టు మండలం పి.కొత్తకోట వద్ద రమేష్‌బాబు ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించేందుకు ప్రయత్నించాడు.

ఈ క్రమంలో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టవేరా కారును ఢీకొన్నాడు. టవేరా కారు రోడ్డు పక్కకు దిగింది. రమేష్‌బాబు దంపతులు వెళుతున్న కారు రోడ్డుపై రెండు పల్టీలు కొట్టింది. తీవ్రంగా గాయపడిన రమేష్‌బాబు, అనూరాధ అక్కడికక్కడే మృతి చెందారు. టవేరా కారులో ఉన్న  డ్రైవర్‌తోపాటు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పూతలపట్టు ఎస్‌ఐ మల్లేష్‌యాదవ్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హైవే పట్రోలింగ్‌ వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీకి పంపించారు. వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. రమేష్‌బాబు, అనూరాధ మృతదేహాలను తిరుపతి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పాకాల సీఐ హరినాథ్‌ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. పూతలపట్టు మండలానికి చెందిన 108 వాహనం మరమ్మతులకు గురికావడంతో ప్రమాదాల్లో గాయపడిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అతివేగంతోనే ప్రమాదం
సాధారణంగా ఆల్టో కారులో డ్రైవర్‌ సీటు, పక్క సీటు ఎదురుగా బెలూన్‌లు ఉండవు. అందువల్ల 80 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ వెళ్లరాదు. ప్రమాద సమయంలో రమేష్‌ బాబు వేగంగా వెళ్లడంతోనే కారు కంట్రోల్‌ తప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు అభిప్రాయపడ్డారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top