మరో ఐదుగురిపై సీఐడీ కేసులు

CID cases against five others in Insider Trading - Sakshi

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో ఇప్పటికే ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులపై నమోదు

రూ.2 లక్షలకు పైగా నగదుతో అసైన్డ్‌ భూములు కొన్న వారిపై చర్యలు

ఐటీ శాఖ కమిషనర్‌కు సీఐడీ ఏడీజీ లేఖ

అక్రమంగా పొందిన తెల్లకార్డులు రద్దుచేయాలని కలెక్టర్‌కు వినతి

సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో టీడీపీ పెద్దల అండతో సాగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ డొంక కదులుతోంది. ఇందుకు కారకులైన వారిపై సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంకు చెందిన దళిత మహిళ పి.బుజ్జి ఫిర్యాదుతో టీడీపీ మాజీ మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు మరో నేత బెల్లంకొండ నరసింహారావులపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనితోపాటు కురగల్లు గ్రామానికి చెందిన పల్లెపోగు శివశంకర్‌ ఫిర్యాదుతో తాతా బసవశంకర్రావు, పాలడుగు నాగలక్ష్మిలపై కూడా కేసు నమోదు చేసింది. తాజాగా.. కృష్ణాజిల్లా విజయవాడ, యనమలకుదురు, పెనమలూరు, పోరంకి ప్రాంతాలకు చెందిన వారిపై సీఐడీ ఐదు కేసులు నమోదు చేసింది.

ఇందులో భాగంగా పెనమలూరు తహసీల్దార్‌ జి. భద్రు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యనమలకుదురుకు చెందిన పొల్లినేని కొండలరావుపై కేసు నమోదు చేసింది. తప్పుడు ధృవపత్రాలు చూపించి తెల్లకార్డు పొందిన కొండలరావు రాజధాని ప్రాంతంలోని నేలపాడులో ఎకరా 8 సెంట్లు భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇతనిపై ఐపీసీ సెక్షన్‌–177, 403, 420, 468, 471, 120(బి) కింద కేసు నమోదు చేసిన అధికారులు అతని తెల్లకార్డు రద్దుకు సిఫారసు చేశారు. అలాగే, పెనమలూరుకు చెందిన మండవ నాగమణి వెంకటపాలెంలో 95 సెంట్లు.. రిటైర్డ్‌ రైల్వే ఉద్యోగి బొల్లినేని నాగలక్ష్మి.. ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగి అయిన భూక్యా నాగలక్ష్మి.. పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చెందిన అబ్దుల్‌ జమేదార్‌ తప్పుడు పత్రాల ద్వారా తెల్లకార్డులు పొంది తద్వారా రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసినందుకు కేసు నమోదు చేశారు.

అసైన్డ్‌ భూములు కొన్న 106 మంది జాబితా ఐటీ శాఖకు..
కాగా, అమరావతిలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన 106 మంది జాబితాను ఆదాయ పన్ను (ఐటీ) శాఖకు సీఐడీ మరోసారి పంపించింది. ఈ మేరకు వారికి సంబంధించిన చిరునామా, తెల్లకార్డు నంబర్, కొనుగోలు చేసిన భూమి విస్తీర్ణం, దాని విలువ తదితర  వివరాలతో ఐటీ శాఖ కమిషనర్‌కు ఏపీ సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ లేఖ రాశారు. అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిన వారు, రూ.2 లక్షలకు పైగా మొత్తాలను నగదు రూపంలో చెల్లించిన వారి వివరాలను అందజేశారు. వీరిపై ఐటీ యాక్టు కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంత భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే అనేక అక్రమాలు వెలుగుచూశాయని.. నిబంధనలకు విరుద్ధంగా భూములు కొనుగోలు చేసిన వారిలో తెల్లకార్డుదారులు కూడా ఉన్నారని సీఐడీ ఆ లేఖలో వివరించింది. మరోవైపు.. ఉద్యోగాలు చేస్తున్న వారు, భూములు కలిగిన వారు, విలువైన ఆస్తులు కలిగిన వారు నిబంధనలకు విరుద్ధంగా పొందిన తెల్లకార్డులను రద్దుచేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ను కూడా సీఐడీ అధికారులు కోరారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top