ప్రైవేట్‌ కండక్టర్‌పై కేసు నమోదు

Case Filed On Private RTC Driver - Sakshi

ఆర్టీసీ నగదు రూ.16,626 స్వాహా

సాక్షి, మధిర(‍ఖమ్మం) : టీఎస్‌ ఆర్టీసీ మధిర డిపోలో ప్రైవేటు కండక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బస్సు టికెట్లను విక్రయించగా వచ్చిన సొమ్మును స్వాహా చేశాడు.  మండల పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన పిల్లి శేఖర్‌బాబు మధిర డిపోలో ప్రైవేటు కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన హైదరాబాద్‌ వెళ్లే బస్సులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 7న డిపోలో టికెట్ల విక్రయానికి సంబంధించిన డబ్బులను జమచేసి బయటకు వస్తుండగా పోలీసులు సాధారణ తనిఖీలు చేశారు. అయితే రూ.21,900 విలువచేసే టికెట్లు ఆయన వద్ద అక్రమంగా ఉన్నట్లు తేలింది. వాటిలో రూ.16,626 విలువచేసే టికెట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. రూ.50 వేల విలువచేసే టికెట్లు మూడు బ్లాకులు, రూ.24 విలువచేసే టికెట్లు రెండు బ్లాకులు, రూ.21 విలువచేసే టికెట్లు ఒక బ్లాకు శేఖర్‌బాబు వద్ద అక్రమంగా ఉంచుకున్నాడు.

ఒక్కో బ్లాకులో 100 టికెట్లు ఉంటాయి. అక్టోబర్‌ 11నుంచి ప్రయాణికులకు టికెట్లు జారీ చేయాలని డిపో అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. దీంతో అప్పటినుంచి ప్రైవేటు కండక్టర్ల వద్ద పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 7న శేఖర్‌బాబును తనిఖీచేయగా ఈ డబ్బులు స్వాహా చేసినట్లు గుర్తించారు. ఈ విషయంపై శేఖర్‌బాబుపై మధిర టౌన్‌ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది. మధిర డిపో ఆదాయం రోజుకు రూ.7.85లక్షలు లక్ష్యం కాగా కనీసం రూ.4లక్షల ఆదాయంకూడా రావడంలేదు. ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతోపాటు కొంతమంది ప్రైవేటు కండక్టర్ల చేతివాటంతో డిపోకు రావాలి్సన ఆదాయం తగ్గుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఒకరిద్దరి కండక్టర్ల వద్ద డబ్బులు ఎక్కువగా ఉండటాన్ని గమనించి వారిని హెచ్చరించి వదిలేసినట్లు తెలిసింది. 

దీనిపై  డిపో మేనేజర్‌ జీవీఎస్‌ నారాయణను వివరణ కోరగా..  డిపోలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు వేర్వేరు శాఖలకు సంబంధించినవారు కావడంతో గందరగోళం నెలకొంటోందని అన్నారు.  కండక్టర్లకు టికెట్లు బ్లాకులు ఇచ్చేటప్పుడు మర్చిపోవడంకానీ లేదా ఈ టికెట్‌ బ్లాకులను అతను చోరీ చేయడంకానీ జరిగి ఉండవచ్చని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top