బాసరలో దారుణం

Brutal murder in Basar - Sakshi

తండ్రీ కొడుకుల దారుణ హత్య 

దోపిడీ దొంగల పనిగా అనుమానం

నగదు, నగలు ఎత్తుకెళ్లిన దుండగులు

మృతులది కేరళ రాష్ట్రం ఎర్నాకులం

బతుకుదెరువు కోసం వచ్చి బలి..

భైంసా/బాసర(ముథోల్‌): బాసరలో దోపిడీ దొంగలు దారుణానికి ఒడిగట్టారు. ఓ ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న తండ్రీ కొడుకులను పొట్టనబెట్టుకున్నారు. నగదు, నగల కోసం ఇద్దరిని బలితీసుకున్నారు. వదస్సేరిస్‌ గోపీనాథ్‌ (70), ఆయన కుమారుడు వదస్సేరిస్‌ రతిశ్‌ (45)లను హత్యచేసి దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం వీరిద్దరు నిద్రలోకి జారుకున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు కత్తులతో కిరాతకంగా వీరిని నరికారు. నగదు, నగలతో ఉడాయించారు. అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఘటన బాసరలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

కేరళ నుంచి వచ్చి..
భైంసా–బాసర ప్రధాన రహదారిపై రైల్వేస్టేషన్‌ సమీపంలో కేరళ రాష్ట్రంలోని ఎర్నకులానికి చెందిన వదస్సేరిస్‌ గోపీనాథ్‌ కుటుంబం స్టార్‌ ఇన్‌ రెస్టారెంట్‌ హోటల్‌ నిర్వహిస్తోంది. గోపీనాథ్‌ కొడుకు రతిశ్‌ హోటల్‌ వ్యాపారం చూసుకుంటున్నాడు. ఆయన భార్య శివరాణి ఇటీవలే ఎర్నకులానికి వెళ్లింది. రతిశ్‌ కుమారుడు అభిషేక్‌ హైదరాబాద్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు.

కేరళ నుంచి తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు వెళ్లి కొన్ని రోజులు అక్కడే వ్యాపారం చేసుకున్నారు. 12 ఏళ్ల క్రితం వీరు బాసరకు చేరుకున్నారు. ఇక్కడే స్థిరపడి హోటల్‌ వ్యాపారం చేస్తున్నారు. భవనం ముందుభాగంలో హోటల్‌ నిర్వహిస్తూ వెనకాలే నివసిస్తున్నారు. 

దోపిడీ హత్యలే..
మంగళవారం రాత్రి హోటల్‌ మూసి వెనకాలే ఉన్న ఇంట్లో గోపీనాథ్, రతిశ్‌ నిద్రపోయారు. గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి రెస్టారెంట్‌ గోడ దూకి లోపలికి చొరబడ్డారు. హాల్‌లో నిద్రిస్తున్న రతిశ్‌ను, బెడ్‌రూంలో నిద్రిస్తున్న గోపీనాథ్‌ను కిరాతకంగా చంపేశారు. 

ఇంట్లో ఎవరూలేక..
రక్తపు మడుగుల్లో ఉన్న తండ్రీకొడుకుల మృతదేహాలను పోలీసు సిబ్బంది ఆటోలో వేసి పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందించినా సుదూరంగా ఉన్న భార్య, బంధువులు బాసర చేరుకోలేకపోయారు. దీంతో ఇంట్లో ఉన్న నగదు, ఆభరణాలు ఎన్ని చోరీకి గురయ్యాయనే వివరాలు తెలియరాలేదు. 

ఇలా వెలుగులోకి..
బుధవారం హోటల్‌లో పని చేసే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికి హోటల్‌ తెరవకపోవడంతో అనుమానం వచ్చి ఏం జరిగిదని లోపలికి వెళ్లి చూడగా రక్తపు మడుగుల్లో మృతదేహాలు కనిపించాయి. దీంతో సిబ్బంది బయటవారికి సమాచారం అందించారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న చిరువ్యాపారులు, స్థాని కులు అక్కడికి చేరుకుని బాసర పోలీసులకు సమాచారం అందించారు.

బాసర ఎస్సై మహేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఎస్సై సమాచారంతో ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్, ముథోల్‌ సీఐ రఘుపతి అక్కడికి వచ్చారు. క్లూస్‌ టీం బృందంతో వివరాలు, నమూనాలు సేకరించారు. ప్రత్యేక బృందాలతో అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు జాగిలాలు రహదారి వెంట పరుగెత్తాయి. జాగిలాలు పరుగెత్తిన మార్గాన్ని బట్టి ఈ సంఘటనకు పాల్పడ్డవారు ఎవరై ఉంటారని ఆరా తీస్తున్నారు. 

సీసీ పుటేజీ కొల్లగొట్టి..
దుండగులు సీసీ పుటేజీని కొల్లగొట్టారు. హార్డ్‌డిస్క్‌ను ఎత్తుకు వెళ్లారు. పక్క వ్యూహంతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన స్థలానికి ఇరువైపులా ఉన్న దుకాణాల్లోని సీసీ పుటేజీలపై దృష్టి సారించారు.  

పార్థి ముఠా పనేనా?
బాసరలో స్థిరపడ్డ హైదరాబాద్‌కు చెందిన సాలిక అశోక్, ఆయన భార్య సువర్ణ, కుమారుడు మణికంఠలను దోపిడీ దొంగలు 2013లో దారుణంగా హత్యచేశారు. పార్థి ముఠాయే ఆ కుటుంబాన్ని కడతేర్చినట్లు తేల్చిన పోలీసులు ఈ ముఠా సభ్యులను పట్టుకున్నారు. జైలుశిక్ష అనుభవించిన వారు ఇటీవలే విడుదలైనట్లు సమాచారం. బాసరలో తాజాగా మళ్లీ రెండో సంఘటన జరగడంతో ఈ ముఠాయే ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. 2013 సంఘటన మరిచిన బాసర వాసులు మళ్లీ ఈ సంఘటన చూసి భయాందోళనకు గురవుతున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top