‘సైతాన్‌ ఆవహించింది.. అందుకే హత్య చేశా’

Brooklyn Ripper Is Found Guilty Of Stabbing Boy To Death  - Sakshi

న్యూయార్క్‌ : బ్రూక్లీన్‌కు చెందిన ఇద్దరు చిన్నారులను అతి కిరాతంగా పొడిచి.. ఓ చిన్నారి చావుకు కారణమైన కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు నిచ్చింది. చిన్నారులను కత్తితో విచక్షణా రహితంగా పొడవడాన్ని అత్యంత హేయమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. నిందితుడు డేనియల్‌ సేయింట్‌ హాబర్ట్‌ మాట్లాడుతూ.. తనను సైతాను ఆవహించిందని, ఆ సమయంలో ఏం చేస్తున్నానో తెలియక చేశానని కోర్టు విచారణలో తెలిపాడు.

వివరాల్లోకి వెళితే..  2014 సంవత్సరంలో బ్రూక్లీన్‌కు చెందిన ప్రిన్స్‌ జోషువా అవిట్టో (​‍6), మికైలా (7) ఇంటి సమీపంలోని ఆట స్థలంలో ఆడుకున్న తర్వాత ఇంటికి బయలు దేరారు. అదే ప్రాంతానికి చెందిన సెయింట్‌ హాబర్ట్‌ వారిని వెంబడించాడు. మెట్ల మీదుగా భవంతి పైఅంతస్థులో ఉన్న తమ ఇంటికి వెళుతుండగా.. లిఫ్టులో వెళితే బాగుంటుందని చెప్పి లోపలికి ఎక్కించాడు హాబర్ట్‌. లిఫ్టు లోపల మాట్లాడుకుంటున్న చిన్నారులను అల్లరి చేయవద్దని హాబర్ట్‌ వారించాడు. అయినా వాళ్లు వినకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ప్రిన్స్‌ను 16 సార్లు పొడిచాడు. ఆ తర్వాత మికైలాను కూడా 12 సార్లు పొడిచాడు. పిల్లల అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో కత్తి అక్కడే పడేసి పరారయ్యాడు. కత్తిపోట్లతో రక్తమోడుతున్న చిన్నారులిద్దరినీ స్థానికులు వెంటనే ఆ‍స్పత్రికి తరలించారు.

తీవ్ర గాయాలతో ఉన్న ప్రిన్స్‌ ప్రాణాలతో పారాడుతూ తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు. మికైలా మాత్రం ప్రాణాలతో బయట పడింది. నాలుగు రోజుల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కత్తి మీద ఉన్న రక్తపు మరకల్లోని డీఎన్‌ఏ సహాయంతో అతడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారించారు. కోర్టు శిక్ష విధించిన అనంతరం ప్రిన్స్‌ తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హాబర్ట్‌కు జీవితఖైదు విధించడంతో తమ కుమారుడి ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top