ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం డేవిడ్ బెక్‌హామ్ దంపతులపై వారి కుమారుడు బ్రూక్లిన్ బెక్‌హామ్ సంచలన ఆరోపణలు చేశాడు. ముఖ్యంగా తల్లి విక్టోరియా బెక్‌హామ్ గురించి అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులను షాక్‌కు గురి చేస్తున్నాయి. బ్రూక్లిన్ పెళ్లి సమయంలో అతడికి తల్లిదండ్రులతో తలెత్తిన విభేదాలు ముదిరిపాకాన పడ్డాయి.
కుటుంబంతో కలిసే ప్రసక్తే లేదు
ఈ క్రమంలోనే భార్య, అమెరికన్ నటి నికోలా పెల్జ్ట్‌తో కలిసి అమెరికాకు వెళ్లిపోయిన బ్రూక్లిన్ అక్కడే నివసిస్తున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబంతో సంబంధాలు పూర్తిగా తెంచుకునేందుకు సిద్ధమైనట్లు తాజాగా అతడు పునరుద్ఘాటించాడు. ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్టులు పెడుతూ సంచలన ఆరోపణలకు దిగాడు.
‘‘చాలా ఏళ్లుగా నేను నిశ్శబ్దంగానే ఉన్నాను. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాను. దురదృష్టవశాత్తూ నా తల్లిదండ్రులు, వారి టీమ్ పదే పదే నన్ను విసిగిస్తూ పబ్లిక్‌గా మాట్లాడేలా చేశారు. నా గురించి వస్తున్న అబద్ధాలకు సమాధానంగా.. ఇప్పటికైనా నిజం చెప్పాలని నిర్ణయించుకున్నాను.
ఇకపై నా కుటుంబంతో తిరిగి కలిసేందుకు ఎంతమాత్రం సిద్ధంగా లేను. ఇతరుల నియంత్రణ, ఆధీనంలో బతకడం నాకు ఇష్టం లేదు. జీవితంలో తొలిసారి నాకోసం నేను నిలబడ్డాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని నా తల్లిదండ్రులే కంట్రోల్ చేశారు. మీడియాలో నా గురించి ఏదేదో రాసేలా చేశారు.
మరీ హద్దులు దాటి..
ఇటీవలి కాలంలో వాళ్లు సోషల్ మీడియాలో మరీ హద్దులు దాటి.. నాపై ప్రేమ ఉన్నట్లుగా.. తమను తాము అమాయకులుగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేశారు. సమాజంలో వారి ప్రతిష్ట కోసమే ఇదంతా చేశారు. అయినా నిజం ఎన్నటికీ దాగదు.
పెళ్లికి ముందు నుంచే నికోలాతో నా బంధాన్ని తెంచాలని నా తల్లిదండ్రులు గట్టిగా ప్రయత్నించారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. పెళ్లికి కొన్ని గంటల ముందు మా అమ్మ కావాలనే నికోలా వెడ్డింగ్ గౌను రెడీ కాకుండా చేసింది. అత్తగారు డిజైన్ చేసిన డ్రెస్ వేసుకోవాలని నికోలా ఎంతగానో ఆశపడింది.
‘లంచం’ ఇచ్చి
కానీ మా అమ్మ ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. అప్పటికప్పుడు తను ఏదో ఒక డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. పెళ్లికి కొన్ని వారాల ముందు నాకు ‘లంచం’ ఇచ్చి నా హక్కులను రాయించుకోవాలని నా తల్లిదండ్రులు ప్లాన్ చేశారు. తద్వారా నా భార్య, భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలను కంట్రోల్ చేయవచ్చనేది వారి ఆలోచన.
కానీ నేను వినలేదు. అప్పటి నుంచి నా పట్ల వారి వైఖరి మారిపోయింది. నా పెళ్లికి ప్రణాళికలు రచిస్తున్న సమయంలో మా అమ్మ నన్ను .. ‘ఈవిల్’ అన్నది. నికోలా, నేను మా నానమ్మలను మాతో పాటు కూర్చోబెట్టుకుంటామని చెప్పడమే ఇందుకు కారణం.
వివాహానికి కొన్ని గంటల ముందు నా కుటుంబం నా దగ్గరికి వచ్చి.. ‘నికోలా మన రక్తం కాదు. మన కుటుంబం కాదు. ఆమె కోసం ఎందుకిదంతా?’ అని ప్రశ్నించారు. అప్పటి నుంచి నా మీద, నా భార్య మీద ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉన్నారు. నా తమ్ముళ్లు కూడా నాపై సోషల్ మీడియాలో దాడికి దిగారు.
మా అమ్మ అంతా చెడగొట్టింది
ఇక పెళ్లి సమయంలో మా అమ్మ నా భార్యను, నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదటిసారి నా భార్యతో రొమాంటిక్ సాంగ్‌కు డాన్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ మా అమ్మ అంతా చెడగొట్టింది. దాదాపుగా 500 మంది అతిథుల ముందు మా అమ్మ నాతో అభ్యంతరకర రీతిలో, అసలు సంబంధమే లేనివిధంగా డాన్స్ చేసింది.
నాకు అదెంతో ఇబ్బందిగా అనిపించింది. అప్పటి వరకు జీవితంలో నేను అంత చెడు అనుభవాన్ని, అవమానాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదు. అందుకే మేము న్యూయార్క్‌లో మరోసారి పెళ్లి చేసుకున్నాము. ఈసారి నా తల్లిదండ్రుల బాధ లేదు. ప్రశాంతంగా సంతోషంగా వేడుక జరుపుకొన్నాము.
నా పాత గర్ల్‌ఫ్రెండ్‌ను పిలిచి
నా భార్యను వాళ్లు ఎప్పటికప్పుడు అవమానిస్తూనే ఉన్నారు. నా పాత గర్ల్‌ఫ్రెండ్‌ను మా అమ్మ పదే పదే ఇంటికి ఆహ్వానిస్తూ మా ఇద్దరికి ఇబ్బంది కలిగేలా చేసింది. అయినా సరే మా నాన్న యాభైవ పుట్టినరోజు కోసం మేము లండన్‌కి వెళ్లాము. కానీ వారం రోజుల పాటు మమ్మల్ని అక్కడికి రానివ్వలేదు. దీంతో మేము హోటల్‌లోనే ఉండిపోయాము.
మా నాన్నతో కాస్త ఎక్కువ సమయం గడపాలని భావించాను. కానీ ఆయన ఇందుకు తిరస్కరించారు. ఆఖరికి నికోలా లేకుండా వస్తేనే నన్ను అక్కడికి అనుమతినిస్తానని చెప్పాడు. ఆ మాట నా చెంప మీద కొట్టినట్లు అనిపించింది. ఆ తర్వాత వాళ్లు లాస్ ఏంజెలిస్‌కు వచ్చినపుడు కూడా నన్ను కలవడానికి ఇష్టపడలేదు.
బెక్‌హామ్ బ్రాండ్‌తో వచ్చే పేరు నాకు, నా భార్యకు అవసరం లేదు. నాకు, నా భార్యకు ప్రశాంతత, గోప్యత, సంతోషం మాత్రమే కావాలి. మా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచాలి’’ అని బ్రూక్లిన్ బెక్‌హామ్ చెప్పుకొచ్చాడు.
సంబంధిత వార్త: David Beckham: భార్యే సర్వస్వం.. తండ్రిని కాదని.. మామగారికి విషెస్..


