మోదీ చౌక్‌లో తెగిపడ్డ తల

BJP Leaders Differences in Modi Chowk Murder Case - Sakshi

పట్నా : బిహార్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ పేరిట ఉన్న ఓ చౌరస్తా పేరును మార్చేందుకు కొందరు యత్నించగా.. అడ్డుకున్న ఓ వృద్ధుడిని దారుణంగా తల నరికి చంపారు. ఈ కేసుపై పోలీసులు, నేతలు ఇచ్చే పొంతన లేకపోవటంతో ఇప్పుడక్కడ ఇది రాజకీయ చర్చకు దారితీసింది. 

బాధిత కుటుంబ సభ్యులు కథనం ప్రకారం... దర్బంగలోని భాదవన్‌ గ్రామం సర్దార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ చౌరస్తాకు ‘ నరేంద్ర మోదీ చౌక్‌’ అనే పేరుంది. శుక్రవారం సుమారు 50-60 మంది ఆర్జేడీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఉప ఎన్నికల్లో విజయంతో నినాదాలు చేస్తూ.. ఆ బోర్డు(మోదీ చౌక్‌)ను తొలగించి.. దానికి లాలూ ప్రసాద్‌ చౌక్‌గా నామకరణం చేసేందుకు యత్నించారు. అయితే వారికి అడ్డుకునేందుకు రాంచంద్ర యాదవ్‌(60) యత్నించగా.. అతన్ని హకీ స్టిక్‌లతో కొట్టి, ఆపై తల నరికి హత్య చేశారు. దాడిలో రాంచంద్ర కొడుకు కమలేష్‌కు కూడా గాయాలయ్యాయి.

పోలీసులు మాత్రం బాధిత కుటుంబ కథనాన్ని కొట్టిపారేస్తున్నారు. ఇరు వర్గాల మధ్య ఎప్పటి నుంచో భూతగాదాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే హత్య జరిగిందని.. పబ్లిసిటీ స్టంట్‌ కోసమే హతుడి కుటుంబ సభ్యులు మోదీ(చౌక్‌) పేరును తెరపైకి తెచ్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు?
ఈ ఘటనపై డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోదీ తన ట్విట్టర్‌లో స్పందించారు. ఆ కథనాలన్నీ అవాస్తవమని.. ఆ చౌక్‌కు పేరు ఎప్పటి నుంచో ఉందని.. అది భూతగాదాలో జరిగిన హత్యేనని ట్వీట్‌ చేశారు. కానీ, శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ మాత్రం ఈ కేసులో అనుమానాలు ఉన్నట్లు చెబుతున్నారు. ‘రామచంద్ర(హతుడు) భార్యతో నేను మాట్లాడా. మీడియా ముందు బోర్డు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావని పోలీసులు ఆమెను బెదిరించినట్లు నాతో చెప్పింది. ఆ లెక్కన్న వాస్తవాలు దాచిపెట్టి పోలీసులు ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనిపిస్తోంది’ అంటూ గిరిరాజ్‌ తెలిపారు. 

ఇక బిహార్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిత్యానంద్‌ రాయ్‌ కూడా ఇది చౌక్‌ పేరు మార్చే క్రమంలో జరిగిన గొడవ అని చెబుతుండటం గమనార్హం. ఏది ఏమైనా ఈ కేసు పోలీసుల తీరుపై విమర్శలకు తావునిస్తోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top