గజ్వేల్‌లో యువతి దారుణ హత్య

Young Woman Brutal Murder In Gajwel - Sakshi

ఇంట్లో ఎవరూ లేని సమయంలో దాడి

పదునైన ఆయుధంతో గొంతు కోయడంతో మృతి.. గజ్వేల్‌లో బ్యాంకు ఉద్యోగిపై ఘాతుకం

వారం రోజుల్లో ఆమెకు వివాహం

ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై తల్లిదండ్రుల ఫిర్యాదు.. కేసు నమోదు

గజ్వేల్‌ (సిద్దిపేట జిల్లా) : వారం రోజుల్లో ఆమెకు పెళ్లి జరగాల్సి ఉంది. తల్లిదండ్రులు ఆ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. ఈలోగా ఘోరం జరిగిపోయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురైంది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో లోపలకు ప్రవేశించిన దుండగుడు పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి చంపేశాడు. మంగళవారం రాత్రి గజ్వేల్‌లో ఈ ఘటన జరిగింది. ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. 

కాబోయే భర్తతో ఫోన్‌లో మాట్లాడుతుండగా..
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన న్యాలకంటి లక్ష్మీరాజ్యం, మణెమ్మ దంపతుల మూడో కుమార్తె దివ్య (25) గజ్వేల్‌లోని ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంకు (ఏపీజీవీబీ)లో ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు వరంగల్‌కు చెందిన సందీప్‌ అనే యువకుడితో వివాహం కుదిరింది. ఈనెల 26న వారి పెళ్లి జరగాల్సి ఉంది. సందీప్‌ కూడా ఏపీజీవీబీలో ఉద్యోగం చేస్తున్నాడు. కోచింగ్‌ సమయంలో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. దీంతో పెద్దల అంగీకారంతో వారి పెళ్లి కుదిరింది. ఈ నేపథ్యంలో దివ్య తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పెళ్లి పనుల నిమిత్తం మంగళవారం ఉదయం ఎల్లారెడ్డిపేట వెళ్లారు. దివ్యను కూడా తమతో రావాలని అడగ్గా.. తనకు బ్యాంకులో పనులున్నాయని, వాటిని పూర్తి చేసుకుంటానని చెప్పి బ్యాంకుకు వెళ్లారు.

ఎప్పటిలాగే సాయంత్రం విధులు ముగించుకుని లక్ష్మీప్రసన్ననగర్‌లో తాము ఉంటున్న ఇంటికి వచ్చారు. అనంతరం తనకు కాబోయే భర్త సందీప్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ మెట్లు దిగుతుండగా.. రాత్రి 8.06 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దివ్యపై దాడి చేశాడు. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోశాడు. ఈ క్రమంలో ఆమె కేకలు వేయడం ఫోన్‌ మాట్లాడుతున్న సందీప్‌కు వినిపించాయి. వెంటనే అతడు గజ్వేల్‌లో తనకు తెలిసిన వారికి ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో చుట్టుపక్కల వారు, తోటి బ్యాంకు ఉద్యోగులు అక్కడకు వచ్చి చూసేసరికి దివ్య రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌తో విచారణ చేశారు.

కొన్నేళ్లుగా యువతికి వేధింపులు...
కుమార్తె హత్యకు గురైందన్న సమాచారం తెలియడంతో దివ్య తల్లిదండ్రులు హుటాహుటిన ఇంటికి వచ్చారు. ప్రేమోన్మాదమే తమ కుమార్తె హత్యకు కారణమని విలపిస్తూ చెప్పారు. గత కొంతకాలంగా వేములవాడకు చెందిన వెంకటేష్‌ అనే యువకుడు దివ్యను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పేర్కొన్నారు. దివ్య హైస్కూల్‌లో చదువుకునే సమయంలో పరిచయం ఉన్న ఆ యువకుడు.. కొన్నేళ్లుగా వేధింపులు తీవ్రతరం చేశాడని చెప్పారు. అతడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్టు వెల్లడించారు. అనంతరం ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించగా.. ఇక తమ కుమార్తె జోలికి రానని కాగితం రాసిచ్చాడని వివరించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో పెళ్లి ఉండగా.. తమ కుమార్తెను పొట్టనపెట్టుకున్నాడని విలపించారు. కాగా, మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంకటేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీపీ నారాయణ తెలిపారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, యువతి ఉంటున్న ఇంటికి అతడు ఏ సమయంలో వచ్చాడు.. ఎలా దాడి చేశాడనే అంశాలను సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తిస్తామని చెప్పారు. ఇప్పటికే తమకు కొన్ని ఆధారాలు లభించాయని వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top