నిర్మలాదేవికి బెయిల్‌ | Bail to Nirmala Devi In Sex Scandal Case Tamil Nadu | Sakshi
Sakshi News home page

నిర్మలాదేవికి బెయిల్‌

Mar 13 2019 1:37 PM | Updated on Mar 13 2019 1:37 PM

Bail to Nirmala Devi In Sex Scandal Case Tamil Nadu - Sakshi

ఆస్పత్రి నుంచి జైలుకు వెళ్తూ..

సాక్షి, చెన్నై: ప్రొఫెసర్‌ నిర్మలాదేవికి ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. ఆమెకు బెయిల్‌ మంజూరు చేస్తూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం మంగళవారం ఆదేశించింది.నలుగురు విద్యార్థినులను మాయమాటలతో తప్పుడు మార్గంలో పయనింపచేయడానికి ప్రయత్నించి అడ్డంగా బుక్కైన అరుప్పు కోట్టై ప్రొఫెసర్‌ నిర్మలాదేవి వ్యవహారం గురించి తెలిసిందే. ఎవరి కోసమో ఆమె ఆ విద్యార్థుల్ని లొంగదీసుకునే ప్రయత్నం చేసినట్టుగా ఆడియో స్పష్టం చేయడం దుమారం రేపింది. ఈ కేసులో నిర్మలాదేవితో పాటుగా మురుగన్, కరుప్పు స్వామిలు అరెస్టయ్యారు. పది నెలలుగా విచారణ శరవేగంగా సాగడంతో అనేక అనుమానాలు, ఆరోపణలు గుప్పించే వాళ్లు ఎక్కువే. వీరికి బెయిల్‌ కూడా రానివ్వకుండా ప్రయత్నాలు సాగుతుండటంతో తెర వెనుక ఎవరో ఉన్నారన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో సిబీసీఐడీ తన విచారణను వేగవంతం చేసి, ఆగమేఘాల మీద చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. వాంగ్ములం సేకరించింది.

సాక్షులను కోర్టు ముందు ఉంచే యత్నం చేసింది. పలుమార్లు ఈ నిందితులు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేసినా, చివరకు నిరాశే. ఎట్టకేలకు మురుగన్, కరుప్పులు సుప్రీంకోర్టు తలుపు తట్టి బెయిల్‌ మీద బయటకు వచ్చారు. అయితే, నిర్మలాదేవికి మాత్రం బెయిల్‌ లభించలేదు. ఇక, విచారణకు హాజరైన సమయంలో భద్రతా వలయాన్ని ఛేదిస్తూ నిర్మలాదేవి మీడియా వద్దకు పరుగులు తీయడం, తాను ఏ తప్పు చేయలేదని, బలవంతంగా కేసులో ఇరికించారని, సంతకాలు బలవంతంగా పెట్టించుకున్నారని ఆరోపిస్తూ కన్నీటి పర్యంతం కావడం ఆ ప్రచారాలకు బలం చేకూరినట్టు అయ్యాయి. అలాగే,  ఎవర్నో రక్షించే ప్రయత్నంలో నిర్మలాదేవి బలి పశువు అయ్యారని, త్వరలో ఆధారాలు బయట పెడుతానంటూ ఆమె న్యాయవాది పసుం పొన్‌ పాండియన్‌ ప్రకటించారు. అలాగే, జైలులో నిర్మలాదేవికి ప్రాణహాని సైతం ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో నిర్మలాదేవికి బెయిల్‌ మంజూరు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అలాగే, సీబీసీఐడీని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేయడమే కాకుండా, నిర్మలాదేవిని కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. ఆ మేరకు మంగళవారం న్యాయమూర్తులు కృపాకరణ్, సుందర్‌ నేతృత్వంలోని బెంచ్‌ ముందుకు నిర్మలాదేవిని సీబీసీఐడీ వర్గాలు హాజరు పరిచాయి. విచారణ, వాదనల అనంతరం నిర్మలాదేవికి నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆమె తరఫు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ, 11 నెలల అనంతరం నిర్మలాదేవికి బెయిల్‌ లభించడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement