కొడుకు కోసం చూసి.. కూతురుని అమ్మేశారు | baby girl sold for rs.80 thousand in warangal rural dist | Sakshi
Sakshi News home page

కొడుకు కోసం చూసి.. కూతురుని అమ్మేశారు

Feb 14 2018 1:49 PM | Updated on Feb 14 2018 1:49 PM

baby girl sold for rs.80 thousand in warangal rural dist - Sakshi

సాక్షి, వర్ధన్న పేట : వారు ఇద్దరు-వారికి ఇద్దరు కూతుర్లు. అయినా కొడుకు కావాలంటూ మూడోసారి మందులు వాడారు. మంత్రాలకు చింతకాయలు రాలవన్న సంగతి తెలియక పూజలు కూడా చేశారు. అయినా మూడో సంతానంగా మరో ఆడశిశువుకు జన్మనిచ్చారు. దీంతో ముగ్గురి పోషణ భారం అంటూ అప్పుడే పుట్టిన ముక్కుపచ్చలారని పసిబిడ్డను అంగడిలో వస్తువులా అమ్మకానికి పెట్టారు. విషయం తెలుసుకున్న ఊరి వాసులు నిలదీయడంతో తప్పు ఒప్పుకున్నారు..

వివరాలు.. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం డిసితాండాకు చెందిన మాలోత్‌ నరేష్‌, రజిత దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయినా మగ సంతానం కోసం వేచి చూడగా ఈనెల 3న మరో ఆడ శిశువుకు జన్మనిచ్చారు.  దీంతో ముగ్గురి పోషణ భారం అంటూ మద్యవర్తులు నీలగిరి స్వామి తాండాకు చెందిన భూక్యా, బౌన్‌ సింగ్‌ల ద్వారా మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన ప్రవీణ్‌కు రూ.80 వేలకు అమ్మారు.

పాపను కొనుగోలు చేసిన వ్యక్తి ఆ డబ్బు మొత్తానికి ప్రామిసరీ నోటు రాయించి, పాపను అధికారికంగా దత్తత తీసుకున్నట్లు పత్రాలు సృష్టించారు. విషయం కాస్తా తాండాలో బయటకు పొక్కడంతో మాలోత్‌ నరేష్‌ దంపతులను తాండావాసులు గట్టిగా నిలదీశారు. అయితే వారి వద్ద నుంచి పొంతన లేని సమాధానాలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement