పాల ప్యాకెట్టే ప్రాణాలు తీసిందా?

Auto Driver Negligence in Chintapalli Incident - Sakshi

చింతపల్లి(పాడేరు): మండలంలోని చెరువూరు వద్ద ఆదివారం విద్యుత్‌ స్తంభాన్ని ఆటో ఢీకొనడంతో ఐదుగురు గిరిజనులు మృతి చెందడానికి పాల ప్యాకెట్టే కారణమని స్థానికులు చెబుతున్నారు. చెరువూరుకు చెందిన వంతాల కృష్ణారావు గత కొంత కాలంగా ఆటో నడుపుతున్నాడు. కోరుకొండలో ఆదివారం జరిగిన వారపుసంతకు వచ్చిన కృష్ణారావు పాలప్యాకెట్‌ కొని, ఆటో స్టీరింగ్‌ భాగంలో పెట్టుకున్నాడు. ప్రయాణికులు ఎక్కిన తర్వాత చెరువూరికి సమీపంలోని దిగువ ప్రాంతానికి వెళుతుండగా పాలప్యాకెట్‌ ఆటో స్టీరింగ్‌ నుంచి జారీ కాళ్లపై పడడంతో ప్యాకెట్‌తీసి పైన పెట్టే క్రమంలో అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టినట్టు కొందరు చెబుతున్నారు. మండలంలోని అన్నవరం ప్రధాన రహదారి నుంచి చెరువూరు వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర 150 విద్యుత్‌ స్తంభాలున్నాయి. ఇవన్నీ ఇనుప స్తంభాలు కావడంతో పాటు సింగిల్‌ లైన్‌ విద్యుత్‌ సరఫరా అవుతుంది. ఆటో స్తంభాన్ని స్వల్పంగా ఢీకొట్టినప్పటికీ పైన విద్యుత్‌ తీగ తెగి ఆటోపై పడడంతో   షాక్‌కు గురై ఐదుగురు మరణించగా, ఆరుగురు గాయాలు పాలైనట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని లోతుగెడ్డ పీహెచ్‌సీకి తరలించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు క్షతగాత్రులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు.

సీఎం స్పందించడం ఇదే ప్రథమం
మండలంలో గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో గిరిజనులు మృత్యువాత పడ్డారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో స్పందించడం ఇదే తొలిసారి అని పలువురు చర్చించుకుంటున్నారు. కడసిల్ప వద్ద జీపు బోల్తాపడి ఏడుగురు గిరిజనులు మృతి చెందారు. అప్పటి మంత్రిగా ఉన్న పసుపులేటి బాలరాజు ఈ ప్రాంతీయుడు కావడంతో స్పందించారు. తర్వాత జర్రెల ఘాట్‌ రోడ్డు వద్ద జీపు బోల్తాపడి నలుగురు గిరిజనులు అక్కడికక్కడే మృతి చెందినా మంత్రి స్థాయిలో కూడా ఎవరూ స్పందించలేదు. గత ఏడాది అన్నవరం వద్ద జీపు ప్రమాదానికి గురై నలుగురు గిరిజనులు మృతి చెందినా అధికారులు మినహా ప్రముఖ నేతలెవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో అత్యంత శివారునున్న విశాఖ మన్యంలోని చింతపల్లి మండలం ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చెరువూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు గిరిజనులు మృతి చెందిన వెంటనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం సర్వత్రా చర్చాంశనీయమైంది. సంఘటన జరిగిన వెంటనే బాధితులను పరామర్శించేందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం అర్ధరాత్రి ఆయన చింతపల్లి చేరుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సోమవారం పాడేరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషాద సంఘటన సమాచారం తెలియడంతో ఆమె ర్యాలీని రద్దు చేసుకుని చెరువూరుకు వెళ్లారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top