ఒక కెమెరాను దొంగిలిస్తే. మరో కెమెరా పట్టించింది | Auto Driver Caught In CC Camera Robbery | Sakshi
Sakshi News home page

ఒక కెమెరాను దొంగిలిస్తే. మరో కెమెరా పట్టించింది

May 3 2019 1:43 AM | Updated on May 3 2019 1:43 AM

Auto Driver Caught In CC Camera Robbery  - Sakshi

అతడో ఆటో డ్రైవర్‌. తన ఆటోను తీసుకెళ్లి ఎంచక్కా ఓ సీసీ కెమెరా కింద ఆపాడు. అటూఇటూ చూసి ఎవరూ తనని చూడకపోవడంతో చకచకా ఆటోపైకి ఎక్కేశాడు. చటుక్కున సీసీ కెమెరా తీగలు కత్తిరించి దాన్ని పట్టుకుని ఉడాయించాడు. అనంతరం దాన్ని ముక్కలు చేసి పాత ఇనుప సామాన్ల దుకాణంలో అమ్మేశాడు. ఇక బస్తీలో తాను చేసే చిల్లర పనులు ఏ కెమెరా రికార్డు చేయలేదులే అన్న ధైర్యంతో బస్తీకి వచ్చేశాడు. ఇంతలోనే పోలీసులు వచ్చి అతగాడిని పట్టుకొని పక్కనే ఉన్న మరో కెమెరాలో ఈయనగారు చేసిన చోరకళను చూపించి బిత్తరపోయేలా చేశారు.

ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. వనపర్తికి చెందిన శాంతానాయక్‌(40) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.52లోని నందగిరిహిల్స్‌ను ఆనుకొని ఉన్న గురుబ్రహ్మనగర్‌లో గుడిసె వేసుకొని బతుకుతూ ఆటో నడుపుతున్నాడు. అతడు మద్యం సేవించడం, పేకాడటం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృశ్యాలు నందగిరిహిల్స్‌లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీల్లో కనిపించడంతో పలుమార్లు పోలీసులు హెచ్చరించారు.

అయితే ఈ సీసీ కెమెరా తన కార్యకలాపాలకు అడ్డుగా ఉందనే కారణంగా ఏకంగా సీసీ కెమెరానే దొంగిలించి అమ్మేశాడు. అయితే అతడు ఈ కెమెరాను దొంగిలిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఇంకో కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ విషయం తెలియని శాంతానాయక్‌ తాను దొంగతనం చేయలేదని బుకాయించగా పోలీసులు ఆ ఫుటేజీలను కళ్ల ముందుంచారు. దీంతో తప్పు ఒప్పుకోక తప్పలేదు. సీసీ కెమెరా దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు కావడం నగరంలో ఇదే మొదటిసారి.     
–హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement