మత్తులో ఉన్న మహిళలే టార్గెట్‌

Auto Driver Arrest in Robbery Case Hyderabad - Sakshi

చోరీలకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్‌ అరెస్ట్‌

రూ. 6 లక్షల విలువైన బంగారం, వెండి  స్వాధీనం

నాగోలు: కల్లు తాగి మత్తులో ఉన్న మహిళలను టార్గెట్‌గా చేసుకొని వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న ఆటో డ్రైవర్‌ను వనస్థలిపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.6.10 లక్షల విలువైన 9.8 తులాల బంగారు నగలు, 100 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. లాల్‌దర్వాజా ప్రాంతానికి చెందిన ముదావత్‌ గంగ్య కొన్నేళ్లుగా నగరంలో ఆటో నడుపుతున్నాడు. గత కొంత కాలంగా కల్లు కంపౌండ్‌ల వద్ద మత్తులో ఉన్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. కల్లు కంపౌండ్‌ల వద్ద మాటువేసే అతను  బంగారు నగలతో కంపౌండ్‌కు వచ్చిన మహిళలను అనుసరించేవాడు. తక్కువ ధరకే ఆటో వారిని తీసుకెళతానని నమ్మించి నగర శివార్లలోకి తీసుకెళ్లి నగలు లాక్కునేవాడు.  చంపాపేట్‌లోని ఓ కల్లు కంపౌండ్‌లో ఓ మహిళకు కల్లు తాగించి మత్తులోకి జారుకున్న తర్వాత ఇంజాపూర్‌ సమీపంలోకి తీసుకెళ్లి ఒంటిపై ఉన్న నగలను దోచుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆటో నెంబర్‌ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.   ఇదే తరహాలో ఆరుగురు మహిళల వద్ద బంగారం  నగలు, నగదు చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య, డీఐ జగన్నాథ్‌ పాల్గొన్నారు.

బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌
నాగోలు: పార్కింగ్‌ చేసిన వాహనాలతో పాటు ఒంటరిగా బైక్‌లపై వెళ్తున్న వారిని బెదిరించి ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పహాడీషరీఫ్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు. ఎల్‌బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌  కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీకి చెందిన మహ్మద్‌ షబాజ్, మహ్మద్‌ అమీర్‌ పాషా, మహ్మద్‌ ఆసిఫ్, మహ్మద్‌ అబ్బాస్, సయ్యద్‌ ఆరిఫ్‌ స్నేహితులు. జల్సాలకు అలవాటు పడిన వీరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలు చేయాలని నిర్ణయించుకున్నారు. పాతబస్తీ, పహడీషరీష్‌ ప్రాంతాల్లో హోటళ్లు, ఇళ్ల ముందు పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్‌ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ తరహాలో ఆరు బైక్‌లను దొంగిలించారు. పహడీషరీష్‌  నుంచి జల్‌పల్లికి  బైక్‌పై వెళుతున్న యువకుడిని బెదిరించి బైక్‌తో సహా సెల్‌ ఫోన్, డబ్బులు లాక్కెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. కేసు నమోదు చేసి  6 ద్విచక్ర వాహనాలను స్వా«ధీనం చేసుకొని    నిందితులను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ, పహాడీçషరీష్‌  ఇన్‌స్పెక్టర్‌ శంకర్, డీఐ అర్జున్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top