
బెర్లిన్: జర్మనీలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో దాదాపు 8 మంది మృతిచెందారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రెండు చోట్ల దుండగులు కాల్పులకు తెగబడ్డారని.. వారి గురించి ఇంతవరకు ఎటువంటి సమాచారం తెలియరాలేదన్నారు. హనావులోని హుక్కా లాంజ్‌లే లక్ష్యంగా కాల్పులు జరిపారని.. ఈ ఘటనలో 8 మంది మృతిచెందినట్లు తెలిపారు. క్షతగాత్రుల సంఖ్య ఇంకా తేలాల్సిఉందన్నారు. ఘటనాస్థలిలో ఉన్న ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా నైరుతి జర్మనీలోని హనావు పట్టణంలో దాదాపు లక్ష మంది జనాభా ఉంటారు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక నాలుగు రోజుల క్రితం బెర్లిన్‌లో కూడా దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. టెంపోడ్రమ్‌లో కామెడీ షో జరుగుతున్న సమయంలో దాడి చేసి... ఓ వ్యక్తిని హతమార్చారు.
చదవండి: కోవిడ్ మృతులు 2 వేలు