కోవిడ్‌ మృతులు 2 వేలు

Coronavirus death toll exceeds 2000 - Sakshi

74,185 మందికి వ్యాధి నిర్ధారణ

జపాన్‌ ఓడ నుంచి 500 మందికి విముక్తి

బీజింగ్‌/టోక్యో: చైనాలో కోవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య బుధవారానికి 2,004కు చేరుకోగా, బాధితుల సంఖ్య 74,185కు చేరుకుంది. దాదాపు 25 దేశాల్లోని వెయ్యిమందికి వ్యాధి సోకినట్లు అధికారులు నిర్ధారించారు.  చికిత్స అందిస్తున్న వైద్యులు వ్యాధిబారిన పడడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.   కరోనా కారణంగా పౌరులు తమకు కావాల్సిన ఆహారం, నిత్యావసరాలను ఆన్‌లైన్‌లో ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. దీంతో ఈ కామర్స్‌ సంస్థలకు గిరాకీ భారీగా పెరిగిపోయింది. ఇప్పటికే తమ వద్ద ఉన్న 1.80 లక్షల మంది సిబ్బందికి అదనంగా 20వేల మందిని నియమించుకున్నట్లు జేడీ డాట్‌ కామ్‌ పేర్కొంది. కోవిడ్‌ భయంతో జపాన్‌ తీరంలో 14 రోజులుగా నిలిపి ఉంచిన డైమండ్‌ ప్రిన్సెస్‌ ఓడ నుంచి  కరోనా లక్షణాలు లేని 500 మంది బయటకు వచ్చారు. ఓడలోని 3,711 మందిలో 542 మందికి కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

కోవిడ్‌ కట్టడిలో చైనా విఫలమైందంటూ ఈ నెల 3వ తేదీన ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ ప్రచురించిన ‘చైనాయే అసలైన రోగి’ (చైనా ఈజ్‌ది రియల్‌ సిక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఆసియా)కథనంపై ఆ దేశం మండిపడింది. క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్‌కు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తలొగ్గక పోవడంతో ఆ పత్రిక రిపోర్టర్లు ముగ్గురికి చైనా దేశ బహిష్కారం విధించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top