‘అరవింద సమేత’ దృశ్యాలు లీక్‌

Aravinda Sametha Scenes Leak Case Files In Hyderabad - Sakshi

సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు

నిందితుడి గుర్తింపు.. అతడి కోసం వేట

సాక్షి, సిటీబ్యూరో: కొత్త సినిమాలను ‘లీక్‌’ భయం వెంటాడుతోంది. ఏపీలో ‘గీత గోవిందం’ సినిమా క్లిప్పింగ్స్‌ లీకేజ్‌ మరువక ముందే నిర్మాణంలో ఉన్న జూ.ఎన్టీఆర్‌ చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో తమ చిత్రంలోని కొన్ని వీడియోలు లీక్‌ అయ్యాయంటూ నిర్మాణ సంస్థ మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. హారిక అండ్‌ హాసిని సంస్థ జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ చిత్రాన్ని నిర్మిస్తోంది. షెడ్యూల్స్‌ వారీగా ప్రతిరోజు జరిగే షూటింగ్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను వీరు ఓ హార్డ్‌డిస్క్‌లో సేవ్‌ చేస్తారు.

ఈ డేటాను సినిమా ఎడిటింగ్‌ చేసి తుది మెరుగులు దిద్దే సమయంలో అవసరమైతే వినియోగిస్తారు. ఈ వీడియోల డేటాను భద్రపరిచే బాధ్యతలను నిర్మాణ సంస్థ ఫిల్మ్‌నగర్‌లోని డాటా డిజిటల్‌ బ్యాంక్‌కు అప్పగించింది. అందులో పనిచేసే టెక్నికల్‌ సిబ్బంది సినిమా షూటింగ్‌కు సంబంధించిన మూడు నిమిషాల నిడివి గల వీడియో క్లిప్‌ను లీక్‌ చేశారు. ఇది యూట్యూబ్‌తో పాటు మరికొన్ని సోషల్‌ మీడియా సైట్లలో వైరల్‌గా మారడంతో విషయం నిర్మాణ సంస్థ దృష్టికి వచ్చింది. దీంతో ఈ సంస్థ నిర్వాహకుడు రాధకృష్ణ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌ సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేయగా డేటాను భద్రపరిచే విభాగంలో పనిచేస్తున్న చక్రవర్తి అనే యువకుడు ఈ వీడియోను కాపీ చేసి, తన స్నేహితులకు షేర్‌ చేసినట్లు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top