ఓవియాపై మరో కేసు

Another Case File on Actress Oviya - Sakshi

పెరంబూరు: నటి ఓవియాపై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో మరో కేసు నమోదైంది. బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో పాపులర్‌ అయిన నటి ఓవియ ఇటీవల నటించిన చిత్రం 90 ఎంఎల్‌. మహిళా దర్శకురాలు అనితాఉదీప్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో నటి ఓవియా విచ్చలవిడిగా నటించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ చిత్రంలో ఓవియా ధూమపానం చేయడం, మద్యం తాగడం, లిప్‌లాక్‌ సన్నివేశాలు, సహజీవనం లాంటి సన్నివేశాలు మన సంస్కృతి సంప్రదాయాలు మంటగలిపేలా ఉన్నాయంటూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ చిత్ర దర్శకురాలు అనితాఉదీప్, కథానాయకి ఓవియాలపై ఇప్పటికే పోలీస్‌స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా తిరువేర్కాడుకు చెందిన తమిళ్‌వేందన్‌ అనే వ్యక్తి బుధవారం స్థానిక వెప్పేరిలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

అందులో.. ఇటీవల పొల్లాచ్చిలో 100 మందికి పైగా విద్యార్థినులు అత్యాచారం, చిత్రవధకు గురయ్యారన్నాడు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌ వంటి సెల్‌ఫోన్‌ పరిజ్ఞానంతో ప్రేమ, పెళ్లి పేర్లతో కట్ర పన్ని ఆ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు చేసిన ఆకృత్యాలు మానవ జాతికే అవమానం అని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరిగేలా సినిమాలు రూపొందించడం అంతకంటే నీచంగా పేర్కొన్నారు. గత మార్చి 1వ తేదీన అనిత ఉదీప్‌ దర్శకత్వంలో నటి ఓవియ ప్రధాన పాత్రలో నటించిన 90ఏఎల్‌ చిత్రం విడుదలైందని, ఇందులో ఓవియ సభ్యసమాజం తల దించుకునేలా నటించిందని వివరించారు. తమిళ సంస్కృతిని నాశనం చేసేవిధంగా, మహిళలను తప్పుదోవ పట్టించే విధంగా 90 ఎంఎల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు అనిత ఉదీప్, అందులో నటించిన నటి ఓవియలను అరెస్ట్‌ చేయాలని కోరాడు. అతని ఫిర్యాదుపై  పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top