దూసుకొచ్చిన మృత్యువు

Amritsar Train Accident highlights: Centre to give Rs 2 lakh to kin of deceased, Rs 50,000 to injured - Sakshi

పట్టాలపై నిల్చుని రావణ దహనం చూస్తున్న ప్రజలను ఢీకొన్న రైలు 

61 మంది దుర్మరణం..

మరో 72 మందికి తీవ్ర గాయాలు 

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దారుణ ప్రమాదం  

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ

భీతావహంగా ఘటనాస్థలి

పంజాబ్‌లో పండుగ రోజు మహా విషాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై నిల్చుని దగ్గరలోజరుగుతున్న రావణ దహన కార్యక్రమాన్ని చూస్తున్న ప్రజలపైకి ఓ రైలు మృత్యువులా దూసుకొచ్చింది. అదే సమయంలో మరో ట్రాక్‌పై ఇంకో రైలు రావడంతో అక్కడివారికి తప్పించుకునేందుకు ఎలాంటి అవకాశం లభించలేదు. కళ్లు మూసి తెరిచేలోగా ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, అవయవాలు తెగిపడిన క్షతగాత్రులతో నిండిపోయింది. పండుగ వాతావరణం నెలకొన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా బాధితుల ఆర్తనాదాలు, బంధుమిత్రుల రోదనలతో మార్మోగింది.  ఈ ఘటనలో దాదాపు 61 మంది మృత్యువాత పడగా, మరో 72 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నగర శివార్లలో శుక్రవారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. జోడా ఫాటక్‌ అనే గ్రామ సమీపంలో ప్రజలు రైలు పట్టాలపై నిల్చుని దగ్గరలోని మైదానంలో జరుగుతున్న రావణ దహన కార్యక్రమాన్ని చూస్తుండగా.. జలంధర్‌ నుంచి అమృత్‌సర్‌ వస్తున్న రైలు పట్టాలపై ఉన్న ప్రజలను ఢీకొంటూ వేగంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 61 మంది మృతి చెందగా మరో 72 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో పట్టాలపై దాదాపు 300 మంది వరకు ఉండగా, రావణుడి దిష్టిబొమ్మకు అప్పుడే నిప్పుపెట్టి టపాసులు పేలుస్తుండటంతో ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు మరింతమంది పట్టాలపైకి వచ్చారని అధికారులు తెలిపారు.

టపాసుల శబ్దం కారణంగా రైలు శబ్దం వినిపించకపోవడంతో ప్రజలు తొందరగా పట్టాల నుంచి పక్కకు రాలేకపోయారన్నారు. జలంధర్‌–అమృత్‌సర్‌ రైలు ప్రజలపైకి దూసుకొచ్చిన సమయంలోనే పక్కనే ఉన్న మరో ట్రాక్‌పైకి ఇంకో రైలు కూడా రావడంతో పట్టాలపై ఉన్న ప్రజలు ఎటూ తప్పించుకోలేకపోయారు. దీంతో బాధితుల సంఖ్య భారీగా పెరిగిందని అమృతసర్‌–1 సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ రాజేశ్‌ శర్మ వివరించారు. ప్రమాద సమాచారం తెలియగానే సహాయక కార్యక్రమాలు చేపట్టామనీ, క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు.


(చెల్లాచెదరుగా పడిన మృతదేహాలను తరలిస్తున్న పోలీసులు )

ఆందోళనకు దిగిన స్థానికులు
అధికారులు, నాయకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రజలు తమ వాళ్ల మృతదేహాల కోసం పట్టాల పక్కన వెతుక్కుంటుండగా, మృతుల బంధువుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా విషాదం అలముకుంది. పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య, స్థానిక ఎమ్మెల్యే నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూకు వ్యతిరేకంగా స్థానికులు నినాదాలు చేశారు. అంతకుముందు రావణ దహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయ చర్యల్లో ఎలాంటి లోపం జరగకుండా చూడాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ కూడా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉండగా తన అన్ని కార్యక్రమాలనూ రద్దు చేసుకుని భారత్‌కు తిరిగొస్తున్నట్లు చెప్పారు. సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు ఘటనాస్థలికి శనివారం వెళ్తున్నట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తెలిపారు.

ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామన్నారు. ప్రమాదంపై హోంమంత్రి రాజ్‌నాథ్, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పూర్తి రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని రాజ్‌నాథ్‌ తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారిపై సమాచారం అందించేందుకు రైల్వే 0183–2223171, 2564485 హెల్ప్‌లైన్లను ప్రారంభించింది.

రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్‌ సిన్హా, రైల్వే బోర్డు చైర్మన్‌ అశ్వనీ లోహానీ, ఇతర రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.  మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రమాద ఘటనపై దర్యాప్తునకు ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఆదేశించారు. సహాయ చర్యల పర్యవేక్షణకు ఒక క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ప్రమాదం నేపథ్యంలో తన ఇజ్రాయెల్‌ పర్యటనను సీఎం అమరీందర్‌ సింగ్‌ వాయిదా వేసుకున్నారు.  

కార్యక్రమానికి చీఫ్‌ గెస్ట్‌ సిద్ధూ భార్య
రావణ దహన కార్యక్రమానికి మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ భార్య, స్థానిక ఎమ్మెల్యే నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రమాదానికి రైల్వే అధికారులే కారణమనీ, ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని ఆమె కోరారు. నవజ్యోత్‌ కౌర్‌ మాట్లాడుతూ ‘ప్రజలను రైలు పట్టాలపై మేం బలవంతంగా కూర్చోబెట్టామా? ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్న వారికి సిగ్గుండాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఆమె ఇంటికి వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో స్థానికులకు సాయం చేయడం లేదంటూ సిద్ధూ, నవజ్యోత్‌ కౌర్‌లకు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. మరోవైపు ప్రమాదానికి ముందే తాను అక్కడి నుంచి వెళ్లిపోయాననీ, తన అనుచరులు ఫోన్‌ చేసి చెప్పగానే గాయపడినవారిని పరామర్శించేందుకు వైద్యశాలకు వెళ్లానని నవజ్యోత్‌ కౌర్‌ చెప్పారు.

కాగా, ప్రత్యక్ష సాక్షి ఒకరు మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తర్వాత కూడా నవజ్యోత్‌ కౌర్‌ ప్రసంగిస్తూనే ఉన్నారని చెప్పడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందనీ, ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రమాదాన్ని నివారించగలిగే వారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోపించారు. ఈ ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి, శిరోమణి అకాలీ దళ్‌ నాయకురాలు హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ అన్నారు.  

వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి
అమృత్‌సర్‌ రైలు ప్రమాదంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు వైఎస్‌ జగన్‌ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నలు దిక్కులా విషాదం
కాసేపటి క్రితం వరకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆహ్లాదంగా గడిపినవారు.. క్షణాల్లో నిర్జీవ దేహాలుగా మారిన దారుణం గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షులను కలచివేస్తోంది. ఊహించని ఈ ఉత్పాతాన్ని అర్థం చేసుకునేందుకు, ఇది వాస్తవమని విశ్వసించేందుకు వారి మనస్సు అంగీకరించడం లేదు. నలు దిక్కులా పడిపోయిన వారిలో తమవారిని వెతుక్కోవాల్సిన విషాదం వారికి పండుగ ఆనందాన్ని దూరం చేసింది.

ఈ దసరా తెచ్చిన షాక్‌ నుంచి తేరుకునేందుకు వారికి చాలా సమయమే పట్టేలా ఉంది. ‘నా కుమారుడు ఎక్కడ? అతడిని చూపించండి.. తెచ్చివ్వండి’ అంటూ ఓ తల్లి హృదయవిదారకంగా విలపిస్తున్న దృశ్యం అక్కడివారిని కలచివేసింది. ’ముఖ్యంగా దసరా సమయంలో ఇక్కడ రైళ్ల వేగాన్ని తగ్గించేలా చూడండి అని స్థానిక ప్రజా ప్రతినిధులను, అధికారులను కోరాం. మా మాటలను ఎవరూ పట్టించుకోలేదు’ అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశారు.

రైలు ఢీకొట్టి వెళ్లినా సెల్ఫీలే
రైలు ప్రమాదానికి ముందు, ఆ తర్వాత కూడా పలువురు అక్కడే తమ సెల్‌ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ ఉండటం పట్ల పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవజ్యోత్‌ కౌర్‌ మాట్లాడుతూ ప్రజలు రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారనీ, ప్రమాదం ఎలా జరిగిందో ఎవరికీ తెలీదని అన్నారు.

జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన ఓ వీడియో పోస్ట్‌ చేస్తూ ‘మతిలేని ప్రజలు పూర్తిగా నివారిందగ్గ విషాదమిది. రైలు సాటి మనుషుల పైనుంచి వెళ్లిన తర్వాత కూడా ఏ మాత్రం చలించకుండా కొందరు సెల్ఫీలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. రైలు ప్రజలను ఢీకొడుతున్నా అక్కడి వారు సెల్ఫీలు తీసుకోవడం విస్మయం కలిగిస్తోందని ఆప్‌ నాయకురాలు ప్రీతి శర్మ అన్నారు.  

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ రైలు ప్రమాదం నా గుండెను కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. గాయపడ్డవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నా. బాధితులకు అవసరమైన సాయాన్ని అందించాల్సిందిగా అధికారులను ఆదేశించాను’
–ప్రధాని నరేంద్ర మోదీ

అమృత్‌సర్‌లో సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తా. గాయపడ్డవారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.  
–పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌

పంజాబ్‌ రైలు ప్రమాదంలో 50 మందికిపైగా దుర్మరణం చెందడం షాకింగ్‌కు గురిచేసింది. ప్రమాదస్థలిలో త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని పంజాబ్‌ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ కార్యకర్తలను నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
– కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ


ఘటనకు ప్రధాన కారణాలు
ఆ ప్రాంతంలో లెవల్‌ క్రాసింగ్‌ను ఏర్పాటు చేయలేదు.
 రైలు వచ్చేముందు హార్న్‌ కొట్టలేదు, వేగాన్ని తగ్గించలేదు 
 అక్కడ రైల్వే పోలీసులు కానీ, సంబంధిత ఇతర అధికారులు కానీ ఎవరూ లేరు. 
 (రావణ దహనం కార్యక్రమం గురించి తమకు సమాచారం లేదని రైల్వే అధికారులు వివరణ ఇచ్చారు) 
  భద్రత గురించి కార్యక్రమ నిర్వాహకులు సరైన చర్యలు చేపట్టలేదు. పట్టాలపై ఎవరూ నిల్చోకుండా హెచ్చరికలు జారీ చేయలేదు. 


(జనంపైకి దూసుకొస్తున్న రైలు (వృత్తంలో), ప్రమాదానికి ముందు రావణ దహన దృశ్యం. )

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top