డోన్‌ ఎంవీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

ACB Officers Raids Dhone MVI Office In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు(డోన్‌ టౌన్‌) : ఋపట్టణంలోని రవాణా శాఖ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ముగ్గురు అనధికారిక ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40,020 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అధికారులు అనధికారిక ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నిర్ణయించిన రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఏసీబీ కర్నూలు డీఎస్పీ నాగభూషణం, సీఐలు ప్రవీణ్‌కుమార్, అస్రాద్‌బాష తమ సిబ్బందితో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రహస్యంగా కాసేపు ఇక్కడి పరిస్థితులను పరిశీలించారు. తర్వాత కార్యాలయంలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న చంద్రమోహన్, అన్సర్‌బాష, అక్బర్‌ అనే అనధికారిక ఏజెంట్లను అదుపులోకి తీసుకుని..విచారణ చేశారు.

వారు అక్రమంగా కల్గివున్న రూ.40,020 స్వాధీనం చేసుకున్నారు. ఎంవీఐ శివశంకరయ్యను కూడా విచారించారు. ఒరిజినల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు వాహనదారులకు ఇవ్వకుండా అనధికారిక ఏజెంట్ల చేతికిచ్చి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కార్యాలయంలో ఎంవీఐ ఉన్న సమయంలోనే అనధికారిక ఏజెంట్లు కూడా ఉన్నారని, వారి వద్ద ఒరిజినల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లతో పాటు అధిక మొత్తంలో డబ్బు లభ్యమైందని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. ఎంవీఐపై తుదపరి చర్యల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే 9440446178 ఫోన్‌ నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top