breaking news
MVI office
-
డోన్ ఎంవీఐ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
సాక్షి, కర్నూలు(డోన్ టౌన్) : ఋపట్టణంలోని రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ముగ్గురు అనధికారిక ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40,020 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ అధికారులు అనధికారిక ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నిర్ణయించిన రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఏసీబీ కర్నూలు డీఎస్పీ నాగభూషణం, సీఐలు ప్రవీణ్‌కుమార్, అస్రాద్‌బాష తమ సిబ్బందితో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. రహస్యంగా కాసేపు ఇక్కడి పరిస్థితులను పరిశీలించారు. తర్వాత కార్యాలయంలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న చంద్రమోహన్, అన్సర్‌బాష, అక్బర్ అనే అనధికారిక ఏజెంట్లను అదుపులోకి తీసుకుని..విచారణ చేశారు. వారు అక్రమంగా కల్గివున్న రూ.40,020 స్వాధీనం చేసుకున్నారు. ఎంవీఐ శివశంకరయ్యను కూడా విచారించారు. ఒరిజినల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు వాహనదారులకు ఇవ్వకుండా అనధికారిక ఏజెంట్ల చేతికిచ్చి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. కార్యాలయంలో ఎంవీఐ ఉన్న సమయంలోనే అనధికారిక ఏజెంట్లు కూడా ఉన్నారని, వారి వద్ద ఒరిజినల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లతో పాటు అధిక మొత్తంలో డబ్బు లభ్యమైందని ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. ఎంవీఐపై తుదపరి చర్యల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే 9440446178 ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
కొత్త వాహన చట్టంతో అంతా అలర్ట్
సాక్షి, మిర్యాలగూడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వాహన చట్టంతో వాహనదారులు అంతా అలర్ట్ అవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడే అమలు లేకపోయినప్పటికీ అక్కడక్కడా జరిమానాలు విధించడం వల్ల ముందస్తు జాగ్రత్తలు పడుతున్నారు. ఈ నెల 1వ తేదీన నుంచి కొత్త వాహనం చట్టం అమలులోకి వచ్చినా అంతకుముందునుంచే జిల్లాలోని ప్రధాన పట్ట ణాలైన నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. దీంతో వాహనదారులు ముందస్తుగా వాహనానికి రిజిస్ట్రేషన్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గతంలో జిల్లాలో రోజుకు వంద మంది దరఖాస్తులు చేసుకునే వారు.. కానీ నెల నుంచి రోజుకు రెండు వందల మంది దరఖాస్తు చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. లెర్నింగ్ లైసెన్స్‌లకు భారీగా దరఖాస్తులు మిర్యాలగూడ ఎంవీఐ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం కూర్చున్న దరఖాస్తు దారులు ఇన్ని రోజులు వాహనం నడుపుతున్నా డైవ్రింగ్ లైసెన్స్ ఎందుకులే అనుకున్నారు. కొత్త వాహన చట్టం రావడం వల్ల అలాంటివారందరూ లెర్నింగ్ లైసెన్స్ కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడలలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం రోజుకు వందల మంది వెళ్తున్నారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ ఎంవీఐ కార్యాలయాల్లో ఈ ఏడాది జూలై మాసంలో 2,645 మంది కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోగా, ఆగస్టు మాసంలో 2,507 మంది తీసుకున్నారు. ఈ నెలలో ఏడు పని దినాల్లోనే ఇప్పటివరకు 1,418 మంది దరఖాస్తులు చేసుకొని లెర్నింగ్ లైసెన్స్‌లు పొందారు. స్లాట్ బుకింగ్‌కు వారం రోజుల గడువు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారు, పర్మనెంట్ లైసెన్స్ తీసుకునే వారు ముందుగా మీ సేవా కేంద్రంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంది. స్లాట్ బుకింగ్ చేసుకున్నాక గతంలో ఒక్క రోజులోనే ఎంవీఐ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ దరఖాస్తులు పెరగడం వల్ల వారం రోజులు ఆగాల్సి వస్తుంది. కొత్తగా లెర్నింగ్ లైసెన్స్ కోసం ద్విచక్ర వాహనానికి 300 రూపాయలు, ద్విచక్రవాహనాలతోపాటు నాలుగు చక్రాల వాహనానికి 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ద్విచక్ర వాహనానికి 1,035 రూపాయలు, ద్విచక్ర వాహనంతో పాటు నాలుగు చక్రాల వాహనానికి 1,335 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువమంది డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. కొత్త వాహన చట్టం రావడం వల్ల డ్రైవింగ్ వచ్చిన వారంతా లైసెన్స్ తీసుకుంటున్నారు. గతంలో రోజుకు 40 నుంచి 45 మంది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు. కానీ ప్రస్తుతం 90నుంచి వంద మంది దరఖాస్తు చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందుతున్నారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. దీనితోపాటు వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. – శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ, మిర్యాలగూడ -
ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి
రాయచోటి, న్యూస్‌లైన్ : రాయచోటి మోటారు వెహికల్ అధికారి కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కంప్యూటర్ గదితో పాటు అనధికార ఏజెంట్ల వద్ద నుంచి రూ.80,890 స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎంవీఐ కార్యాలయంపై సోమవారం తిరుపతి, కడపకు చెందిన ఏసీబీ సీఐలు పార్థసారధిరెడ్డి, రామకిషోర్, సుధాకర్, లక్ష్మికాంత్రెడ్డితోపాటు సిబ్బంది ఆకస్మికంగా దాడులు చేశారు. ఎంవీఐ మధుసూదన్‌రెడ్డితో పాటు సిబ్బందిని ప్రశ్నించి రికార్డులను సోదా చేశారు. దాడి సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ గదితో పాటు, అనధికార ఏజంట్లు రమణ, సుబ్బారా వు, రాజశేఖర్‌రెడ్డిల వద్ద నుండి Rs 80,890లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీబీ సీఐ పార్థసారధిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకే ఎంవీఐ కార్యాలయంపై దాడులు చేశామన్నారు. దాడులలో కార్యాలయంలోని కంప్యూటర్గదిలో, అనధికార ఏజెంట్ల వద్ద సుమారు రూ.80,890 స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడ్డ నగదు విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు.