రూ.లక్ష లంచం తీసుకుంటూ..

ACB Attacks On Medical Parishad official Chunduru Prasanna Kumar - Sakshi

ఏసీబీకి పట్టుబడ్డ వైద్య విధాన పరిషత్‌ అధికారి

సహకరించిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కూడా అరెస్ట్‌

లక్ష్మీపురం (గుంటూరు): వైద్య విధాన పరిషత్‌ గుంటూరు జిల్లా కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ చుండూరు ప్రసన్నకుమార్‌ బుధవారం గుంటూరులో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. బాపట్లకు చెందిన మధ్యవర్తి, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి గోపీకృష్ణ ద్వారా డైట్‌ కాంట్రాక్టర్‌ తాడిబోయిన శ్రీనివాసరావు నుంచి రూ.లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అదనపు ఎస్పీ సురేష్‌బాబు సిబ్బందితో పట్టుకున్నారు. అదనపు ఎస్పీ సురేష్‌బాబు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.  కాంట్రాక్టర్‌ తాడిబోయిన శ్రీనివాసరావు బాపట్ల, తెనాలి ఆస్పత్రుల్లో రోగులకు ఆహారం (డైట్‌) సరఫరా చేస్తుంటారు.

అందుకు సంబంధించిన బిల్లులను జిల్లా వైద్య విధాన పరిషత్‌ కార్యాలయం మంజూరు చేయాలి. రూ.20 లక్షలు బిల్లు మంజూరై మూడు నెలలు అవుతున్నా అనేక కొర్రీలు పెడుతూ అందులో 15 శాతం లంచంగా ఇవ్వాలని జిల్లా కో–ఆర్డినేటర్‌  ప్రసన్నకుమార్‌ వేధిస్తున్నారు. అంత డబ్బు ఇచ్చుకోలేని చెప్పడంతో చివరకు 5 శాతం అంటే రూ.లక్ష ఇవ్వాలని తేల్చి చెప్పారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని కాంట్రాక్టర్‌ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు.

వారి సూచన మేరకు 19వ తేదీన ప్రసన్నకుమార్‌కు కాంట్రాక్టర్‌ శ్రీనివాసరావు ఫోన్‌ చేసి రూ.లక్ష సిద్ధం చేశానని చెప్పారు. అయితే ఆ నగదును బాపట్ల ఆసుపత్రిలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్న గోపీకృష్ణకు అందజేయాలని సూచించారు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్‌ గుంటూరు జిల్లా వైద్య విధాన పరిషత్‌ కార్యాలయం వద్ద ఉన్నాని చెప్పగా బాపట్ల నుంచి వచ్చిన గోపీకృష్ణ వచ్చి రూ.లక్ష తీసుకుంటున్న సమయంలో ఏసీబీ  అధికారులు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో డాక్టర్‌  ప్రసన్నకుమార్‌తోపాటు గోపీకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top