
సాక్షి, అమరావతి/విజయవాడ : ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ అందిన ఫిర్యాదు మేరకు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జిల్లా స్థాయి శిక్షణా సంస్థ అధికారిగా పనిచేస్తున్న కోనేరు శ్రీనివాసకుమార్ ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం దాడులు చేశారు.
ఉదయం ఐదు గంటల నుంచి విజయవాడ నగరంతో పాటు ఆటోనగర్, పెనమలూరు పరిసర ప్రాంతాల్లో శ్రీనివాసకుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు స్నేహితులకు సంబంధించి ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. పెద్దఎత్తున బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ మీడియాకు విడుదల చేశారు.