భ్రూణహత్యలకు అడ్డుకట్ట ఏదీ?

Abortion Rate Increasing In Srikakulam  - Sakshi

పాలకొండ ఏరియా ఆస్పత్రిలో వెలుగుచూసిన ఘటన

వైద్యుల తీరుపై విమర్శల వెల్లువ

పాలకొండ : భ్రూణ హత్యలు నేరమని, అమ్మతో సమానమైన ఆడపిల్లను పురిటిలోనే చంపేయడం మహా పాపమని ఎంతగా ప్రచారం చేస్తున్నా.. ఎన్ని కఠిన శిక్షలు ఉన్నా ఫలితం ఉండటం లేదు. కాసుల కక్కుర్తితో కొందరు వైద్యులు యథేచ్ఛగా అబార్షన్లు చేసేస్తున్నారు. ముఖ్యంగా పాలకొండ ఏరియా ఆస్పత్రిలో భ్రూణహత్యలు దర్జాగా కాని చ్చేస్తున్నారు. తాజాగా సోమవారం ఆస్పత్రిలో జరిగిన భ్రూణహత్య వెలుగులోకి వచ్చింది. వీరఘట్టం మండలం తెట్టంగి గ్రామానికి చెందిన ఐదునెలల గర్భిణికి సోమవారం అబార్షన్‌ చేయిం చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఆమె మరోసారి లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకోగా మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుడుతుందని తెలుసుకున్నారు. దీంతో ఆబార్షన్‌ చేయించుకునేందుకు పాలకొండ ఏరి యా ఆస్పత్రిలోని వైద్యురాలిని సంప్రదించారు. అబార్షన్‌ చేయడం నేరమని, దీనికి సదరు వైద్యురాలు అంగీకరించలేదు. దీంతో గర్భిణి ఇంటికి వెళ్లిపోయింది. ఆ వైద్యురాలు విధుల్లో లేని సమయంలో ఏరియా ఆస్పత్రిలోనే మరో వైద్యురాలిని సంప్రదించగా ఆమె అందుకు అంగీకరించింది. సోమవారం ఏరియా ఆస్పత్రిలోనే అబార్షన్‌ చేయించింది. ఈ విషయమై వైద్యుల మధ్య విభేదాలు కూడా వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రిలోనే భ్రూణహత్యలను ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాసులు లేనిదే కేసులు ముట్టరు..!

పాలకొండ ఏరియా ఆస్పత్రిలో కొంతమంది వైద్యులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వారి నుంచి కాసులు దండుకోవడం ఇక్కడ పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  స్త్రీ ప్రసూతి విభాగంలో అవసరం ఉన్నా.. లేకపోయినా సిజేరియన్లు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ ప్రసవం జరిగితే రూ.3వేలు, అదే సిజేరియన్‌ చేస్తే రూ.10 వేలుగా ధరలు నిర్ణయించి ఇక్కడ కొందరు వైద్యులు చేతివాటం చూపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

డబ్బులు లేని కేసులను రిఫర్‌ చేస్తున్నారని చెబుతున్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన గర్భిణులకు ఇక్కడ ప్రసవాలు జరపడం లేదు. ఎందుకంటే వారు డబ్బులు ఇవ్వరు.. ఒకవేళ అడిగినా ఐటీడీఏ పీఓకు ఫిర్యాదు చేస్తారనే భయంతో వారిని శ్రీకాకుళం రిఫర్‌ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు జనరల్‌ విభాగంలో శస్త్ర చికిత్సలు డబ్బులు లేనిదే జరగడం లేదు. ఆరోగ్యశ్రీలో నమోదు కావాలి.. లేకుంటే సొంతడబ్బులైనా చెల్లించాలని ఒక వైద్యుడు రోగులను వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉన్నతాధికారులకు నివేదిస్తాం..

ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జె.భాస్కరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఆస్పత్రిలో అబార్షన్‌ జరిపినట్లు రికార్డుల్లో నమోదై ఉందని చెప్పారు. కేస్‌ షీట్‌లో చనిపోయిన ఆడశిశువు అని రాశారని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం వార్డుల్లో పరిశీలించగా సదరు మహిళ అప్పటికే ఇంటికి వెళ్లిపోయినట్లు గుర్తించామన్నారు. దీనిపై పరిశీలన జరిపి ఉన్నతాధికారులను నివేదిస్తామన్నారు. అవసరమైతే డీఎస్పీకీ ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.

ఇక ఆస్పత్రిలో ప్రసవాల విషయంలో జరుగుతున్న వివాదంపై ఫిర్యాదులు అందుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. పలుమార్లు వైద్యులకు చెప్పినా  తీరు మారలేదని, ఇక్కడి విషయాలపై ఉన్నతాధికారులకు నివేదించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. గిరిజన కేసులను రిఫర్‌ చేయడం, డబ్బులు వసూలు చేయడం వంటి సంఘటనలు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top