సాక్షి, ముళబాగిలు : ఆటో చెట్టుకు ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన కర్ణాటకలోని ముళబాగిలు తాలూకాలోని గాజులబావి వద్ద శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. డ్రైవర్ ఆటోపై నియంత్రణ కోల్పోవడంతో అది చెట్టును ఢీకొంది. అందులోని ప్రయాణికుల్లో ముగ్గురు సంఘటనా స్థలంలోనే మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు తాయలూరు రోడ్డులోని ఖాద్రిపుర శని మహాత్మ దేవాలయానికి కుటుంబ సమేతంగా ఆటోలో వచ్చి తిరిగి వెళ్తుండగా రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుణ్ణకుప్ప గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ భాస్కర్(25), పార్వతమ్మ(28), గౌరమ్మ(30)లు ఘటనా స్థలంలోనే మరణించారు. నారాయణప్ప, శంకరమ్మ, వి.కృష్ణమూర్తి, ఎ.శంకరలు తీవ్రంగా గాయపడ్డారు. శంకరమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.