ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్‌

3 Fake Police Arrested And Seized Car In PSR Nelloru  - Sakshi

సాక్షి, నెల్లూరు(కావలి) : తెలంగాణలో బేల్దారులుగా పనులు చేస్తున్న ‘పసుపులేటి’ సోదరులు ఆంధ్రలో మాత్రం నకిలీ పోలీసుల అవతారం ఎత్తి ప్రజలను బురిడీ కొట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌ పర్యవేక్షణలో కావలి రూరల్‌ సీఐ టి.మురళీకృష్ణ ఆధ్వర్యంలో బిట్రగుంట ఎస్సై బి.భరత్‌కుమార్, సిబ్బంది నకిలీ పోలీసుల వేషంలో వసూళ్లకు పాల్పడుతున్న ‘పసుపులేటి’ సోదరులను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ డి.ప్రసాద్‌ తన కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బోగోలు మండలం అనంతబొట్లవారి కండ్రిగ గ్రామానికి చెందిన పసుపులేటి గోపి, జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన పసుపులేటి మహేష్, పసుపులేటి తిరుమల తెలంగాణలో బేల్దారి పనులు చేస్తున్నారు. వీరు వినాయక చవితి ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వచ్చారు. సోదరులైన వీరు ముగ్గురు తెలంగాణ రిజిస్ట్రేషన్‌ కలిగిన కారులో తిరుగుతూ రోడ్లుపై కనిపించిన వారిని తాము పోలీసులమని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలో బోగోలు మండలం సుందరగిరివారి కండ్రిగ వద్ద మోటారు సైకిల్‌పై వెళ్తున్న పాపన చెంచురామి రెడ్డి అనే వ్యక్తిని ఆపి పోలీసులమని బెదిరించి, బండి కాగితాలు చూపించమని, డబ్బులు ఇవ్వమని దబాయించారు. దీంతో బాధితుడు తన కుమారుడికి ఫోన్‌ చేసి సమాచారాన్ని తెలియజేశాడు. దీంతో అతని కుమారుడు గ్రామస్తులను వెంట పెట్టుకొని అక్కడికి చేరుకోగానే నకిలీ పోలీసుల అవతారంలో వసూళ్లకు పాల్పడుతున్న ‘పసుపులేటి’ సోదరులు తమ కారులో పరారీ అయ్యారు. ఈ  ఘనటపై బాధితుడు బిట్రగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకొన్న పోలీసులు విచారించి నకిలీ పోలీసులను గుర్తించి ఆదివారం బిట్రగుంటలోని రైల్వేగేటు సమీపంలో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారి వద్ద ఉన్న కారును స్వాధీనం చేసుకొన్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top