ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం

2 Lashkar terrorists eliminated in Kulgam encounter - Sakshi

మృతుల్లో లష్కరే డివిజినల్‌ కమాండర్‌ షకూర్‌ అహ్మద్‌

బలగాలకు లొంగిపోయిన మరో ఉగ్రవాది

రాళ్లమూకపై ఆర్మీ కాల్పుల్లో యువకుడి మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు ఆదివారం లష్కరే తోయిబా కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చాయి. మరొకరిని ప్రాణాలతో పట్టుకున్నాయి. ఈ విషయమై ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(కశ్మీర్‌ రేంజ్‌) స్వయంప్రకాశ్‌ పానీ మాట్లాడుతూ.. కుల్గామ్‌ జిల్లాలోని చద్దర్‌బన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారని నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో ఆర్మీ, సీఆర్పీఎఫ్, కశ్మీర్‌ పోలీసుల సంయుక్త బృందం అక్కడకు చేరుకుని ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని చుట్టుముట్టిందని వెల్లడించారు. భద్రతాబలగాల కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారని పేర్కొన్నారు. దీంతో బలగాలు సైతం ఎదురుకాల్పులు జరిపాయన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన డివిజినల్‌ కమాండర్‌ షకూర్‌ అహ్మద్‌ దార్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ఘటనలో మరో ఉగ్రవాది భద్రతాబలగాలకు లొంగిపోయినట్లు వెల్లడించారు.

ఘటనాస్థలం నుంచి భారీఎత్తున ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నామన్నారు. చనిపోయిన షకూర్‌ అహ్మద్‌తో పాటు బలగాలకు లొంగిపోయిన ఉగ్రవాది స్థానికుడేనన్నారు. ఈ కాల్పుల్లో చనిపోయిన మరో ఉగ్రవాది హైదర్‌ పాకిస్తాన్‌కు చెందినవాడని పేర్కొన్నారు. మరోవైపు కుల్గామ్‌ జిల్లాలోని గోబల్‌ గ్రామంలో ఆర్మీ వాహనంపై అల్లరిమూకలు రాళ్లదాడికి పాల్పడ్డాయి. ఈ దాడి తీవ్రతరం కావడంతో ఆర్మీ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(23) ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి పెల్లెట్‌ గాయాలయ్యాయి. జూన్‌ 20న త్రాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదుల్ని, 22న ఐసిస్‌ కశ్మీర్‌ చీఫ్‌ సహా నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 28న అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతుండటం గమనార్హం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top