ఇద్దరు దొంగలు.. 146మంది పోలీసులు

146 Police Team Nabbed Snatcher In Delhi - Sakshi

న్యూఢిల్లీ : ఆ ఇద్దరు దొంగలు అటు జనాలకు ఇటు పోలీసులకు తలనొప్పిగా మారారు. చాలా తెలివిగా దొంగతనాలు చేసి తప్పించుకునేవారు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు దొంగల కంటే తెలివిగా ఆలోచించి వారిలో ఒకడ్ని పట్టుకున్నారు. ఆ దొంగని పట్టుకోవటానికి ఏకంగా 146మంది పోలీసులు ఆయుధాలతో రంగంలోకి దిగాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే..  గత కొద్దినెలలుగా దక్షిణ ఢిల్లీకి చెందిన మాళవ్యా నగర్‌, సాకేత్‌, నెబ్‌ సరతి, మెహ్రళి, ఫతేహ్‌పుర్‌ బెరి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. పోలీసులు ఆ దొంగలను పట్టుకోవటానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. దొంగలు చాలా తెలివిగా పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకునేవారు.ఇక్కడ ఓ కామన్‌పాయింట్‌ను పోలీసులు అవకాశంగా మలుచుకున్నారు.

నమోదైన అన్ని ఫిర్యాదుల్లోనూ.. ఇద్దరు దొంగలు తెల్ల అపాచీ బైక్‌ మీద వచ్చి మగవాళ్లు, వృద్ధుల మెడలోని ఆభరణాలను చోరీ చేస్తున్నట్లు తేలింది. అదికూడా జనావాసం ఉన్న కాలనీలలో ఉదయం పూట దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. దీంతో 146మంది పోలీసులు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. టెక్నాలజీ సహాయంతో ఆయుధాలు ధరించి దొంగలు తరుచుగా చోరీలకు పాల్పడుతున్న ప్రదేశాలలో కాపుకాశారు. ఎట్టకేలకు పోలీసుల ప్రయత్నాలు ఫలించి దొంగల జట్టులో ఒకడిని పట్టుకున్నారు. అతన్ని ఘజియాబాద్‌కు చెందిన వినీత్‌ వర్మగా పోలీసులు గుర్తించారు. వినీత్‌ అతని మిత్రుడు అమిత్‌ కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. వీరిద్దరిపై ఇదివరకే చాలా కేసులు ఉన్నాయని పెరోల్‌ మీద బయటకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిసింది. అమిత్‌ వద్ద నుంచి ఓ ఆయుధాన్ని, అపాజీ బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top