
రోడ్డు పక్కన ఓ ఆటో ఆగి ఉంది. అక్కడే ఓ వ్యక్తి చేతితో బాలుడిని పట్టుకొని రోడ్డు దాటాలా? వద్దా? అన్న సంశయంలో ఉన్నాడు. ఇంతలో ర్యాష్‌గా డ్రైవింగ్‌తో దూసుకొచ్చిన ఓ హ్యుండయ్ క్రెటా కారు.. అమాంతం రోడ్డుపక్కన ఉన్న ఆటోను ఢీకొట్టేసింది. ఆ దెబ్బకు ముందుకు దూసుకొచ్చిన ఆటో బాలుడిని బలంగా తగిలిదే. కానీ బాలుడిని చేతిలో పట్టుకున్న వ్యక్తి సమయస్ఫూర్తితో వ్యవహరించి.. క్షణాల్లో బాలుడిని తనవైపు లాక్కోవడంతో.. అతనికి పెద్ద ప్రమాదమే తప్పింది.
కానీ కారు వేగంగా ఆటోను ఢీకొంటున్న సమయంలో ఆటో పక్కనుంచి వెళుతున్న వ్యక్తి అమాంతం ఎగిరిపడ్డాడు. ఆ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. కేరళలో జరిగినట్టు భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హ్యుండయ్ క్రెటా కంటే పియాజియో ఆటోలో ప్రయాణించడం సురక్షితమని నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. వెనుక నుంచి క్రెటా వచ్చి ఢీకొట్టిన ఆటోకు పెద్ద నష్టం జరగకపోగా.. ఆటోతోపాటు.. చెట్టును కూడా ఢీకొట్టిన క్రెటా వాహనం తీవ్రంగా దెబ్బతినడంతో నెటిజన్లు ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు.