అంతన్నారు.. ఇంతన్నారు!

nine thousand trees collapsed for road expansion - Sakshi

విస్తరణ మూడు మీటర్లే

అకారణంగా తొమ్మిది వేల చెట్లు నరికివేత

రోడ్డుపక్కన పచ్చదనం మాయం

81 కిలోమీటర్లలో   270 మలుపులు యథాతథం

ప్రాజెక్టు వ్యయం రూ.272 కోట్లు

ఇదీ పలమనేరు–కుప్పం రోడ్డు వెడల్పులో గమ్మత్తు

రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం హంగామా చేసింది. పది మీటర్ల రోడ్డు విస్తరణ పేరిట తొమ్మిది వేల చెట్లను గల్లంతు చేశారు. చివరాఖరికి విస్తరణ మూడు మీటర్లకు పరిమితం చేశారు. దీనివల్ల దశాబ్దాల చరిత్ర, రోడ్డుపక్కన చల్లటి నీడనిచ్చే చెట్లు అదృశ్యమయ్యాయి. ఇందులో కూడా తిర‘కాసు’ పలు సందర్భాల్లో బట్టబయలైంది. మలుపులు యథావిధిగానే వదిలేసి రోడ్డు నిర్మాణం సాగిస్తుండడం ప్రస్తావనార్హం.

‘సాక్షి’ హెచ్చరించినా...
రోడ్డు విస్తరణ చేపట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు. కానీ, జరగబోయే నష్టాన్ని ‘సాక్షి’ ముందుగానే హెచ్చరించింది. అయినా పర్యావరణ ప్రేమికులు స్పందించలేదు. అధికారులు కూడా పట్టించుకోలేదు. రోడ్డు విస్తరణ  రెండు పక్కలా చేయడం కంటే, ఒక పక్క చేపట్టడం వల్ల, పురాతన వృక్ష సంపదను కాపాడవచ్చని పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ పద్ధతి ఆ రోజు పాటించి ఉంటే, తొమ్మిది వేలల్లో కనీసం సగం వంతైనా చెట్లను కాపాడేందుకు ఆస్కారం ఉండేది. చివరాఖరికి ఏమైంది. పది మీటర్లు విస్తారిస్తామని చెప్పిన అధికారులు మూడు మీటర్లకు పరిమితం చేశారు. దీనివల్ల ఇక అర్ధ శతాబ్దం గడిచినా, ఆ నాటి పచ్చదనాన్ని పునరుద్ధరించగలరా?

పలమనేరు: అనంతపురం–కృష్ణగిరి 219– జాతీయ రహదారిలో పలమనేరు నుంచి కుప్పం సమీపంలోని తమిళనాడు రాష్ట్ర సరిహద్దు వరకు రోడ్డు విస్తరణ భారీగా సాగుతుందని ప్రభుత్వం హంగామా చేసింది. పనులు ప్రారంభమై రెండేళ్లవుతోంది. తారురోడ్డు వెడల్పు కేవలం పది మీటర్లే నిర్మిస్తున్నారు. గతంలో ఉన్న ఏడుమీటర్ల రోడ్డును మూడు మీటర్ల పెంచారం తే. మలుపులు లేని రోడ్డు ఉంటుదని చెప్పి, ప్రస్తుతం ఉన్న మలుపులపైనే రోడ్డు వేస్తున్నారు. దీనికోసం రోడ్డుకిరువైపులా ఉన్న 9 వేల వృక్షాలను నేలకూల్చారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణను చూసి సామాన్యులు కూడా ఇంతమాత్రానికే అంతా హడావిడి చేశారే అని పెదవి విరుస్తున్నారు.

వాస్తవమిది
గతంలో రోడ్డు వెడల్పు ఏడు మీటర్లుగా ఉంది. ప్రస్తుతం దీన్ని మూడు మీటర్లు కలిపి 10 మీటర్లుగా విస్తరిస్తున్నారు. రోడ్డుకిరువైపులా షోల్డర్స్‌గా ఆరు అడుగులు ఉంటుంది. ఈ రోడ్డుపై ప్రస్తుతం ఉన్న 270 మలుపులను పూర్తిగా తొలగించనున్నారని అందరూ భావించారు. కానీ పదిచోట్ల తప్పా మిగిలిన మలుపులు అలాగే ఉంటాయి. జాతీయ రహదారులశాఖ స్టాండర్డ్స్‌ ప్రకారం ఈ రోడ్డులో వాహనాలు గంటకు సాధారణంగా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మించనున్నట్లు అప్పట్లో ప్రకటించారు. పాతరోడ్డులోని మలుపుల కారణంగా అంత వేగంగా వెళ్లడం కుదరని పని.

పచ్చదనం మాయం
రోడ్డు విస్తరణ కోసం రహదారికి ఇరువైపులా పచ్చటితోరణంలా ఉన్న లక్షలాది రూపాయల విలువజేసే ఉన్న 9 వేల వృక్షాలను నరికివేశారు. రోడ్డు విస్తరణ కోసం క్యాటిల్‌ఫామ్, నక్కపల్లి, గొల్లపల్లి, కొలమాసనపల్లి, దుగ్గినవారిపల్లి, బేలుపల్లి క్రాస్, సాకేవూరు, చీలంపల్లి, బైరెడ్డిపల్లి, దేవదొడ్డి, తోటకనుమ, కొమ్మరమొడుగు, వి.కోట, శాంతిపురం, తుమ్మిసి, ఏడోమైలు, కుప్పం, నడుమూరు వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న భవనాలు తొలగించడానికి మార్కింగ్‌ వేశారు. చాలా చోట్ల వెల్లువెత్తిన అభ్యంతరాలతో ఆ ఊసే మరుగునపడింది.

నత్తనడకన  పనులు
ఈ పనులను సీఎం చంద్రబాబు 2016లో ప్రారంభించారు. రూ.272 కోట్లతో పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్‌ నుంచి కుప్పం మండలంలోని నడుమూరు సమీపంలోగల తమిళనాడు సరిహద్దు వరకు 81 కి,మీ రోడ్డు విస్తరణ పనులు జరుగనున్నాయి. వీటిని ఈపీసీ (ఇంజినీరింగ్‌ సెస్‌ కాంట్రాక్ట్‌) పద్ధతితో నాగపూర్‌కు చెందిన ఎఫ్‌ఎంఎస్‌ ఇన్‌ఫ్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ చేపడుతోంది. అగ్రిమెంటు ప్రకారం 2018లోపు పనులు పూర్తికావాలి. ఆపై 2022 దాకా రోడ్డు నిర్వహణ బాధ్యత ఆ కంపెనీదే. ప్రస్తుతం పనులు ఆలస్యమవుతున్నాయి. ఈ ఏదాడిలో ఇవి పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

రోడ్డు పదిమీటర్లే
నిబంధనల మేరకు కుప్పం రహదారి పది మీటర్ల వెడల్పు మాత్రమే. మలుపులు లేని రహదారి కాదు. అవసరమైన చోట మాత్రమే చిన్న మార్పులతో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అగ్రిమెంట్‌ ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేయాలి.– చలపతి, ఎన్‌హెచ్‌ డీఈ

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top