36,000 దిగువకు సెన్సెక్స్‌ 

World markets stagger toward end of worst year since financial crisis - Sakshi

చైనా వృద్ధిపై ఆందోళన

పడిపోయిన ప్రపంచ మార్కెట్లు 

నిరాశ నింపిన వాహన విక్రయ గణాంకాలు

అంచనాలు అందుకోలేని జీఎస్‌టీ వసూళ్లు

బలహీనంగా రూపాయి 

36,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌ 363 పాయింట్లు పతనమై 35,892 వద్ద ముగింపు

 10,800 పాయింట్ల కిందకు నిఫ్టీ 

118 పాయింట్ల నష్టంతో 10,793 వద్ద ముగింపు 

కొత్త ఏడాది లాభాల మురిపెం మొదటి రోజుకే పరిమితమైంది. చైనా వృద్ధిపై ఆందోళన కారణంగా ప్రపంచ మార్కెట్లు పతనం కావడంతో మన మార్కెట్‌ కూడా బుధవారం నష్టపోయింది. బలహీనంగా ఉన్న గత నెల వాహన విక్రయాలకు, అంచనాలను అందుకోలేని జీఎస్‌టీ వసూళ్లు జత కావడం, డాలర్‌తో రూపాయి మారకం కూడా పతనం కావడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36,000 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఐదు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది.  ఇంట్రాడేలో 521 పాయింట్ల వరకూ పతనమైన  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 363 పాయింట్లు క్షీణించి 35,892 పాయింట్ల వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు తగ్గి 10,793 పాయింట్ల వద్ద ముగిశాయి.

స్టాక్‌ సూచీలు చెరో 1 శాతం క్షీణించాయి. లోహ, వాహన, బ్యాంక్, ఇంధన షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనం కారణంగా ఐటీ షేర్లు పుంజుకున్నాయి.  కొత్త ఏడాది తొలి రోజు సెలవు కారణంగా మంగళవారం పనిచేయని ప్రపంచ మార్కెట్లు బుధవారం చైనా ఆర్థిక వృద్ధిపై ఆందోళనతో నష్టాలతో ఆరంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్‌ నష్టాల్లోనే ఆరంభమైంది. రోజు గడిచేకొద్దీ పతనం పెరిగిందే కానీ తగ్గలేదు. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 521 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్ల వరకూ నష్టపోయాయి. బ్లూ చిప్‌ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. 

లోహ షేర్లు విలవిల:
చైనాలో వృద్ధి మందగించిందన్న గణాంకాలతో లోహ షేర్లు కుదేలయ్యాయి. ప్రపంచంలో లోహా లను అత్యధికంగా వినియోగించే చైనాలో వృద్ధిపై ఆందోళన కారణంగా  అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ, సీఎల్‌ఎస్‌ఏ పలు లోష షేర్ల రేటింగ్‌ను తగ్గించింది. దీంతో లోహ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, వేదాంత, నాల్కో, జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్, హిందాల్కో షేర్లు 1–4 శాతం రేంజ్‌ వరకూ నష్టపోయాయి. కాగా స్టాక్‌ మార్కెట్‌ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.39 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.144.81 లక్షల కోట్ల నుంచి రూ.143.42 లక్షల కోట్లకు తగ్గింది. సెన్సెక్స్‌లో ఆరు షేర్లు –సన్‌ ఫార్మా, టీసీఎస్, ఏషియన్‌ పెయింట్స్, ఇన్ఫోసిస్, యస్‌బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు మాత్రమే లాభపడగా, మిగిలిన 25 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 50లో 9 షేర్లు లాభపడగా, 41 షేర్లు నష్టపోయాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top